Jul 27,2023 21:39

వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి - పార్వతీపురం :  జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థుల ఉన్నత చదువులకు విదేశీ విద్యా దీవెన నగదు జమ చేసి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా బటన్‌ నొక్కి రూ.45.53 కోట్లు జమ చేశారు. జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకం కింద ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ. 1.25 కోట్ల వరకు ఫీజు రీయింబెర్స్మెంట్‌ చేయనున్నామని, ఇతర విద్యార్థులకు కోటి రూపాయల వరకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్‌ వర్తించనుందన్నారు. ఈ దఫా 357 మంది విద్యార్థులను ఈ పథకం కింద అర్హులకు లబ్ది పొందనున్నారని అన్నారు. పీజీ, పీహెచ్డీ, ఎంబీబీఎస్‌ కోర్సులకు సంబంధించి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంతో మేలు జరగనుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి గయాజుద్దీన్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.