Jul 27,2023 22:53

ప్రజాశక్తి-కాకినాడ ప్రతిభకు పట్టం కట్టి ప్రపంచంలోనే టాప్‌ యూనివర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ అన్నారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని నేరుగా బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్‌ వివేకానంద హాల్‌ నుంచి ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ, సాంఘిక సంక్షేమ శాఖ జెడి డివి.రమణమూర్తి, ఇతర అధికారులు, లబ్ధిదారులతో కలిసి హాజరయ్యారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జిల్లాలోని లబ్ధిదారుల తల్లిదండ్రులకు ఆర్థిక సహకారానికి సంబంధించిన మెగా చెక్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఇలక్కియ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదవగలిగే ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా ఉన్న విద్యార్థులకు అండగా నిలబడి, విదేశీ విద్యకయ్యే ఫీజును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 21 విభాగాలకు సంబంధించి టాప్‌ 50 ర్యాంకులు సాధించిన యూనివర్సిటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగుతోందన్నారు. గురువారం నాటి కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాకు సంబంధించి మొత్తం 12 మంది విద్యార్థులకు రూ.2.06 కోట్ల మేర లబ్ధి చేకూరుతున్నట్లు ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌ ఇలక్కియ వివరించారు. ఈ కార్యక్రమంలో అనసూరి ప్రభాకర్‌, డి.లక్ష్మణ రావు, వివిధ ప్రాంతాల లబ్ధిదారులు హాజరయ్యారు.