Jul 27,2023 22:05

మెగా చెక్కు విడుదల చేస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : విదేశీ విద్య దీవెన పథకం క్రింద జిల్లాలో నలుగురు విద్యార్థులకు లబ్ధి చేకూరిందని కలెక్టర్‌ అరుణ్‌ బాబు పేర్కొన్నారు. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లి నుంచి బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టరేట్‌ లో వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ తో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, పుడా చైర్పర్సన్‌ లక్ష్మీనరసమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ ఆవుటాల రమణారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్‌, గిరిజన సంక్షేమ అధికారి మోహన్‌ రావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ పథకం క్రింద జిల్లాకు రూ. 44,36,627లు మంజూరు కాగా ఈ మొత్తానికి సంబందించిన మెగా చెక్కును కలెక్టరు, ప్రజా ప్రతినిధులు విడుదల చేశారు. సివిల్‌ ఇంజనీర్‌ ఇటలీలో చేస్తున్న ఒడిసి మండలం అల్లాపల్లికి చెందిన అనిత విద్యార్థిని, న్యూయార్క్‌లో విద్యనభ్యసిస్తున్న హిందూపురానికి చెందిన విష్ణు సాయి రాయల్‌, న్యూయార్క్‌ లో ఇంజనీరింగ్‌ చేస్తున్న కొత్తచెరువు చెందిన రాజశేఖర్‌ రెడ్డి, న్యూయార్క్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ విద్యను అభ్యసిస్తున్న పెనుకొండ మండలం కొండంపల్లికి చెందిన భార్గవి సాయి విద్య దీవెన క్రింద ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులకు ఎలాంటి ఆటంకాలు కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులు తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.