గింజపట్టని చిన్నచిన్న చింతకాయలే వామన చింతకాయలు. ఈ సీజన్లో ఇవి మార్కెట్లో అరుదుగా కనిపిస్తాయి. వీటికి కొంచెం ఉప్పు, కారం అద్దుకుని తింటే వారెవ్వా! అనని వారు ఉండరు. అయితే వీటితోనూ రకరకాల వెరైటీ వంటలూ చేయొచ్చు. అవేంటో తెలుసుకుందాం..!
కొబ్బరి పచ్చడి
కావాల్సిన పదార్థాలు : వామన చింత కాయలు - 100 గ్రా, కొబ్బరిముక్కలు - అరకప్పు, పచ్చిమిర్చి - పది.
పోపుకోసం : ఆవాలు - టీ స్పూను, జీలకర్ర - టీ స్పూను, పచ్చి శనగపప్పు - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను, ఎండుమిర్చి - ఆరు, కరివేపాకు - రెండు రెమ్మలు, వెల్లుల్లి రేకలు - నాలుగు, ఉప్పు, పసుపు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం : శుభ్రంగా కడిగిన చింతకాయలను ముక్కలుగా చేసుకోవాలి.
చింతకాయ ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా తిప్పాలి.
కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, వెల్లుల్లి రేకలు జతచేసి మెత్తగా రుబ్బుకోవాలి.
పాన్‌లో నూనె వేడెక్కాక పచ్చి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించి పోపువేసుకోవాలి.
అంతే చింతకాయ కొబ్బరి చట్నీ రెడీ.
చిన్న చేపలు - చింతకాయ
కావాల్సిన పదార్థాలు : చిన్న చేపలు - 500 గ్రా, వామన చింతకాయలు - 100 గ్రా, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి - ఐదు, ఉప్పు - తగినంత, పసుపు - అరస్పూను, కారం - మూడు స్పూన్లు.
తయారుచేసే విధానం :
ముందుగా చిన్న చేపలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
వామన చింతకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి మెత్తగా నూరుకోవాలి.
పాన్‌లో నూనె వేడెక్కాక అందులో చేపలు, నూరిన ముద్ద, పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి కొద్దిసేపు వేయించుకోవాలి.
తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి, చేపలు ఉడికి నీళ్లు ఇగిరిన తరువాత దించుకోవాలి. అంతే రుచికరమైన చిన్న చేపలు సిద్ధం.
పులిహోర
కావాల్సిన పదార్థాలు : వామన చింతకాయలు- 100 గ్రా, పచ్చిమిర్చి- 10 గ్రా, కరివేపాకు- నాలుగు రెమ్మలు, బియ్యం- 150 గ్రా, పసుపు- అరస్పూను, ఉప్పు- తగినంత.
పోపుకోసం : ఎండు మిరపకాయలు- ఎనిమిది, పచ్చి శనగపప్పు- రెండు స్పూన్లు, చాయ మినపప్పు- రెండు స్పూన్లు, వేరు శనగపప్పు- నాలుగు స్పూన్లు, ఆవాలు- ముప్పావు స్పూను, జీడిపప్పు- ఎనిమిది పలుకులు, ఇంగువ- తగినంత, నూనె- 125 గ్రా.
తయారుచేసే విధానం :
అన్నం పొడిపొడిగా వండుకోవాలి. అందులో పసుపు, కరివేపాకు, ఉప్పు, కొంచెం నూనెవేసి వేడిమీదనే గరిటెతో బాగా కలుపుకోవాలి.
తర్వాత స్టౌపై పాన్ పెట్టి మిగిలిన నూనె వేసుకోవాలి. అది బాగా వేడెక్కాక ఎండు మిరపకాయలు, పచ్చి శనగపప్పు, చాయ మినపప్పు, ఆవాలు, ఇంగువ, వేరుశనగ పప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి పోపు బాగా వేగనివ్వాలి.
తర్వాత వామన చింతకాయలను మిక్సీ వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పోపులో వేసుకుని పచ్చి వాసన పోయేదాకా మగ్గనివ్వాలి.
ప్లేటులో సిద్ధంగా ఉంచుకున్న అన్నంలో పోపు వేసుకుని కలుపుకోవాలి.
రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి.
అంతే ఘుమఘుమలాడే వామన చింతకాయల పులిహోర రెడీ.