రాష్ట్రంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ వైరస్ వ్యాప్తిని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. విపత్తులు, సంక్షోభాలు వచ్చినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎల్‌డిఎఫ్ పాలన లోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు కచ్చితంగా నమ్ముతున్నారనీ, ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుచేశాం కనకనే తిరిగి అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. విచ్ఛిన్నకర శక్తులను రాష్ట్ర ప్రజలు అనుమతించరన్నారు. మరి కొద్ది రోజుల్లో కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో... ఆయన ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు...
మీ ప్రచార అస్త్రం ఏమిటి?
మా పోరాటం కేవలం అధికారాన్ని నిలుపుకోవడానికే కాదు. కేరళ అభివృద్ధినీ, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు కట్టుబడి ఉన్నవారికీ, దానిని విచ్ఛిన్నం చేసేందుకు ఎంతకైనా తెగించేవారికి మధ్య జరిగే పోరాటం ఇది. సంక్షేమ చర్యలను, అభివృద్ధి కార్యక్రమాలను మిళితం చేసే విధానాలను కొనసాగించాలని ఓటర్లు మా నుంచి కోరుకుంటున్నారు. మేం దానికి పూర్తిగా కట్టుబడి వున్నాం.
అధికారాన్ని నిలుపుకోవటానికి మీలో ఉన్న నమ్మకం, విశ్వాసం ఏమిటి?
ఎల్‌డిఎఫ్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వమే కొనసాగాలని కోరుకుంటున్నారు. మా ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు కచ్చితంగా నమ్ముతున్నారు. నేను మూడు అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను.
- అభివృద్ధి - ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికబద్ధంగా లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఇప్పటికే రూ.63,200 కోట్ల విలువైన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి.
- సంక్షేమ పథకాలు - నెలవారీ సంక్షేమ పెన్షన్లను రూ.600 నుంచి రూ.1,600కు పెంచాం. మరీ ముఖ్యంగా...ఈ మహమ్మారి సమయంలోనూ ఎవరూ ఆకలితో ఉండకూడదని లక్ష్యంగా పెట్టుకున్నాం. పని చేశాం.
- ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవి - వారి భద్రతకు ప్రాధాన్యతనిచ్చాం. ఒకదాని తర్వాత మరొకటి.. వరుస విపత్తులను కేరళ రాష్ట్రం ఎదుర్కొన్నది. అయినా.. మా ప్రజలను కాపాడుకోవటానికి శాయశక్తులా కృషి చేశాం. అలాగే ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి ఇతర అనేక నిర్దిష్ట కార్యక్రమాలు ఉన్నాయి.
సంక్షేమ పథకాలను తాము కూడా కొనసాగించామని గత ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇందులో మీ ప్రభుత్వ ప్రత్యేకత ఏమిటి?
కేరళలో మొట్టమొదటిసారిగా సంక్షేమ పెన్షన్‌ను 1980లో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వమే ప్రవేశ పెట్టింది. అప్పుడు ప్రతిపక్ష యుడిఎఫ్ ఈ పథకాన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత యుడిఎఫ్ అధికారంలోకి వచ్చినా ఈ పెన్షను ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అంతేకాదు.. ఐదేళ్ల కిందట మేం అధికారంలోకి వచ్చేనాటికి 18 నెలల పెన్షన్ పెండింగ్‌లో ఉన్నది. కేరళలో వరుసగా వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను ముందుకు తీసుకెళ్ళాయని ఎలా చెబుతాయి? విద్య, ఆరోగ్యం, ఆహారం, గృహ నిర్మాణం, పెన్షన్ చాలా ముఖ్యమైనవి. కీలకమైన అవసరాల విషయంలో..మేం కేవలం కాగితాలకే పరిమితం కాలేదు.
ఈ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలేంటి?
కాంగ్రెస్, బిజెపి లది కేరళ వ్యతిరేక వైఖరి. ఈ రెండు శక్తుల మతతత్వ ప్రకటనలు చూస్తే.. ఎన్నికల్లో ఈ పార్టీల మధ్య అపవిత్ర రాజకీయ బంధం ఏర్పడినట్టుగా భావించాలి. గత ఎన్నికల్లో నెమోమ్ నియోజకవర్గంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు (బిజెపి అక్కడ తొలి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది). ఇప్పుడు.. ఆ నియోజకవర్గం చుట్టూ చాలా పెద్ద ప్రచారం జరిగింది. కానీ, ఇతర నియోజక వర్గాలు దానిని పట్టించుకోలేదు. పతనంతిట్ట, అలప్పుజ, పాలక్కడ్ జిల్లాల్లో కాంగ్రెస్, బిజెపి లు ఒకదానికొకటి పరస్పరం సహాయ సహకారాలు అందించుకున్నాయి.
మీతో కలిసి పని చేసిన మీ క్యాబినెట్ సహచరులు చాలా మంది ఈ పోటీలో ఎందుకు లేరు?
మేం సాధించిన ఈ విజయాలు...నాతో సహా ఏ ఒక్క మంత్రో సాధించినవి కావు. ఎల్‌డిఎఫ్ గా మా సమిష్టి కృషి ఫలితమే. ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదు. ఎన్నికల ఫలితాలను నిర్ణయించేది వ్యక్తులు కాదు, రాజకీయాలు.
నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి?
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన అన్ని ప్రధాన సమస్యల పైనా మేం అఖిలపక్ష సమావేశాలు జరిపాం. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాం. విపత్తుల సమయంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ముఖ్యమంత్రిగా నాతోపాటు ప్రతిపక్ష నాయకులను తీసుకెళ్ళాను. నిరంకుశ ప్రభుత్వం ఇలా పని చేస్తుందని వారు భావిస్తే... దాని గురించి చెప్పేదేమీ లేదు.










