ప్రజాశక్తి- నక్కపల్లి:రాజయ్యపేట - దొండవాక ఉప్పుటేరులో చేపలు మృతిపై అధికారులు చేపట్టిన విచారణ బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, మత్స్యకార నాయకులు డిమాండ్ చేశారు.పైప్ లైన్‌కు వ్యతిరేకంగా మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహా ధర్నా ఆదివారం నాటికి 335వ రోజుకు చేరింది. మత్స్యకారులు చేస్తున్న ధర్నాలో అప్పలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలరాజు, మత్స్యకార నాయకులు మాట్లాడుతూ, హెటిరో వ్యర్థ రసాయన జలాలను ఉప్పుటేరులో వదలడంతో ఇటీవల టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడిన విషయం తెలిసిందేనన్నారు. మత్స్యకారులు చేపల మృతిపై ఆందోళన చేపట్టడంతో జిల్లా కలెక్టర్ స్పందించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మత్య్సశాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్‌ను విచారణకు పంపడం జరిగిందన్నారు. మృతి చెందిన చేపలను పరిశీలించి, విచారణ చేసి వాటర్ శాంపిల్‌ను తీసుకువెళ్లి 12 రోజులు అవుతున్నా నేటికీ విచారణ రిపోర్టును బయట పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హెటిరో యాజమాన్యానికి అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే చూస్తూ ఊరుకోమని, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. హెటిరో యాజమాన్యంపై చర్యలు తీసుకుని, మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు గోసల స్వామి, పిక్కి రమణ, చోడిపల్లి రాజు, వాసుపల్లి సోమి, కారే రాజు, మైలపల్లి జాన్, కారే సతీష్, కారే రాజు, పిక్కి కాశీరావు, గోసల వెంకటేష్, పిక్కి తాతాజీ, గోసల దుర్గయ్య, వంకా నాగరాజు పాల్గొన్నారు.










