Jan 24,2023 21:43

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
           రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్య కిరణ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణ ప్రజాసంఘాల కార్యాలయంలో ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి శివ అధ్యక్షతన విద్యార్థి, యువజన సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సూర్యకిరణ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ప్రజాధనాన్ని బడాపెట్టుబడిదారులకు దాసోహం చేస్తూ రాజ్యాంగ హక్కులను కాల రాస్తోందని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించిన ప్రధాని నరేంద్ర మోడీ కరోనా నేపథ్యంలో చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ప్రజలపై పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల భారాలు మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యం నిషేధించి ప్రతీసంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ విస్మరించారన్నారు. సిఎం జగన్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నాడు - నేడు పేరుతో విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తున్నారని, కానీ డిఎస్‌సి ప్రకటించి, ఉపాధ్యాయులను భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలను భర్తీ చేసి కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకించాలన్నారు. పోలవరం నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ, రాష్ట్రానికి విభజన హామీల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో యువతను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధికార ప్రతినిధి పి.పవన్‌, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు ఎ.దిలీప్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి.యశ్వంత్‌, జి.మణి, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు బేతి కిషోర్‌ పాల్గొన్నారు.