కడప అర్బన్ : విభజన హామీలు అమలు చేయడంలో కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు మరిచాయని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకుమార్ తెలిపారు. బుధవారం డివైఎఫ్‌ఐ అధ్వర్యంలో విభజన హామీలు అమలు చేయాలని వినూత్న రీతిలో కడపలో గణపతి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తీవ్ర ద్రోహం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమకు ప్యాకేజీ వంటివి చట్టబద్దంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హక్కులను హరిస్తోందన్నారు. గడిచిన పార్లమెంటు సమావేశాలలో విభజన హామీలను మరచిపోవాలని కేంద్రం స్పష్టంగా చెబుతుందని తెలిపారు. విభజన హామీలు అమలు అయితే రాష్ట్రం సర్వతోముఖాభివద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు 25 ఎంపీలు తనకు ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తానే కేంద్రం దగ్గర మెడలు వంచుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితులలో ఉందన్నారు. పార్లమెంటు సమావేశాలలో బిజెపికి బహిరంగంగా మద్దతు తెలుపుతూ రాష్ట్ర హక్కులను కేంద్రం వద్ద తాకట్టు పెడుతుందని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమ వేస్తే రాయలసీమలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రస్తుతం జరిగే పార్లమెంటు సమావేశాలలో రాష్ట్ర హక్కులు కోసం గళం విప్పాలని డిమాండ్ చేశారు.లేకుంటే చరిత్ర హీనులుగా ప్రజల వద్ద మిగులుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు షాకీర్, ఉపాధ్యక్షులు విజరు పాల్గొన్నారు. బద్వేలు :విభజన హామీలు అమలు చేయాలని డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే మస్తాన్ షరీఫ్, గంగనపల్లి నాగార్జున ఆధ్వర్యంలో గణపతి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ బద్వేల్ పట్టణ నాయకులు యు.ఆంజనేయులు, బాల గురవయ్య, సురేంద్ర, సుభాన్, నరసింహ, ఓబులేసు పాల్గొన్నారు. జమ్మలమడుగు : డివిభజన హామీలు అమలు చేచాలని కోరుడూ డివైఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షులు ఎల్లయ్య అధ్వర్యంలో గణపతి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు బ్రహ్మయ్య, నాగరాజు, మహేష్ పాల్గొన్నారు.










