Jul 31,2023 22:58

ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు

- సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు
ప్రజాశక్తి - ఎచ్చెర్ల: 
విభజన హామీలు అమలు చేయాలని, కడపలో స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మండల కేంద్రంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, రాష్ట్ర ప్రగతి కోరుకునే వారు ఖండించాలని పిలుపునిచ్చారు. కడపలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా కర్మాగారం నిర్మిస్తుందని ఆర్భాటంగా శంకుస్థాపన చేసినా, నేటికీ అతీగతి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేస్తుంటే, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి ఎంపీలు మారు మాట్లాడకుండా కూర్చోవడం బిజెపి ప్రభుత్వానికి సాగిలపడడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు. ప్రజల త్యాగాలు, ప్రజా ధనంతో నిర్మించిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కుట్ర పన్నుతోందన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయుకులు పి.తేజేశ్వరరావు, డి.బంగార్రాజు, రమణ తదితరులు పాల్గొన్నారు.