Oct 10,2022 23:33

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు:కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడటంతోనే విభజన చట్టం హామీలు అమలు కాలేదని, దీనిపై పోరాటం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స డిమాండ్‌ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో పార్టీ మండల కార్యదర్శి ఎల్‌.సుందర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ, 8 ఏళ్లు దాటినా రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక హౌదా, రైల్వే జోన్‌, గిరిజన విశ్వవిద్యాలయం, వెనుక బడిన ఉత్తరాంధ్ర జిల్లాలకు కేటాయించాల్సిన నిధులు తదితర వాటిపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడి విశాఖ ఉక్కు కర్మాగారం వంటి సమస్యలపై పోరాటం చేయలేదన్నారు. ఉక్కు కర్మాగారం లేక పోతే విశాఖపట్నం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 1న జీతాలు కూడా చెల్లించ లేనంతగా రెవెన్యూ లోటు ఉన్నా.. జిఎస్‌టిలో రాష్ట్రానికి న్యాయంగా దక్కే వాటాల పై కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదన్నారు. ప్రజలో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించడానికి ప్రాంతీయ అసమానత రాజకీయాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయని విమర్శించారు. రంపచోడవరం కేంద్రంగా మరో ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ లబ్ది కోసం జెఏసి పేరుతో సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో 3 నిలిపివేస్తే గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీలో బిల్లు పెట్టలేకపోయారని, టిఏసి సమావేశం ఆమోదించిన తీర్మానం అమలు చేయంచలేక పోయారన్నారు. ఆదివాసీ మాతృ భాష విద్యా వాలంటరీలను రెన్యువల్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పోట్టించు కోలేదన్నారు. వికేంద్రీకరణ కోసం జెఏసి ఎర్పాటు చేసిన వైసిపి నేతలు 14,15వ ఆర్ధిక సంఘాల నిధులు దారి మళ్లించడంపై పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంతో అభివద్ధి పథంలో పయనిస్తుందని అప్పలనర్స గుర్తు చేశారు.