Nov 10,2022 23:56

నిరసన తెలుపుతున్న సిపిఎం, సిపిఐ నాయకులు

ప్రజాశక్తి -మధురవాడ : విభజన హామీలపై విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ, సిపిఎం మధురవాడ జోన్‌ కార్యదర్శులు వి.సత్యనారాయణ, డి.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మధురవాడలో గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్‌ కార్యకలాపాలు ప్రారంభం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించాలని, గిరిజన విశ్వవిద్యాలయంపై తాత్సారం మానాలని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను విరమించాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీటి గురించి ప్రశ్నించకుండా మోడీకి భజన చేస్తుందని విమర్శించారు. సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతున్నట్టు బిజెపి నేతలు చెబుతున్నారని, దాన్ని కూడా అంగీకరించబోమని చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించుకుంటూపోతే అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు ఉండవని ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రకు బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజ్‌ ఇస్తామని చెప్పి జిల్లాకు ఏడాదికి రూ.50 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారని విమర్శించారు. రాష్ట్ర రాజధాని ఏదో బిజెపి స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. ప్రధాని సభ పేరుతో ఎయు ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో చెట్లు నరికి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు.