Nov 06,2023 23:42

ఉపాధి అవకాశాలు కనుమరుగు
ప్రత్యామ్నాయ విధానాలతోనే సుపరిపాలన
ప్రజా రక్షణ భేరి యాత్రలో వక్తలు
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి, రాజానగరం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలకు తూట్లు పొడిచిందని, ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లోకనాథం పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర సోమవారం జిల్లాలో పర్యటించింది. రాజానగరం వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ పలువురు నాయకులు పూలమాలలతో యాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లాలాచెరువు సెంటర్‌ నుంచి బైకు ర్యాలీ నిర్వహించారు. కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వ హించారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ విభజన చట్టాలకు మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచినా జగన్‌ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడలేదన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం నిర్మాణం, విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు వంటి హామీలు అటకెక్కాయన్నారు. జిల్లాలో పారిశ్రామిక ప్రగతి మందగించింద న్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. గోదావరి బేసిన్‌లో గ్యాస్‌ నిక్షేపాలు గుజరాత్‌ తరలిపోతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం అదానీ- అంబానీల సేవలో తరిస్తోందన్నారు. రైలు ప్రమాదాలు ప్రయివేటీకరణ ఫలితమేనన్నారు. బటన్‌ నొక్కటం వల్ల ఎంత మంది జీవితాలు మారాయని జగన్‌ను ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో యువతను మోసగించారన్నారు. స్మార్ట్‌ మీటర్లతో ప్రజల జేబులకు చిల్లుపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేదలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి చంద్రబాబు ఏమి ఆశించి బిజెపికి లొంగిపోయారని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్ర బాబు దెబ్బతీశారన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది ఉపాధికి దూరమయ్యారఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను మోడీ ప్రభుత్వం లాగేసుకుంటోందన్నారు. దీన్ని ప్రశ్నించాల్సిన జగన్‌ ప్రభుత్వం నోరెళ్లబెట్టి చూడటం చేతకానితనమేనన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పోటీపడి మద్దతు తెలపడం సరైంది కాదన్నారు. ప్రజలను రక్షించుకోవడం కోసం సిపిఎం చేపట్టిన ఈ యాత్రకు ప్రజలు మద్దతు తెలపా లన్నారు. 15న విజయవాడలో జరిగే ప్రజా గర్జనను జయప్రదం చేయాలన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్‌ మాట్లాడుతూ 15 ఏళ్లలో జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. జివికె, జిఎంఆర్‌ వంటి పవర్‌ ప్లాంట్లు మూతపడ్డాయన్నారు. సిరామిక్స్‌ సంస్థలకూ అదే దుస్థితి తలెత్తిందన్నారు. ఫలితంగా వేలాది మంది ఉపాధికి దూరమయ్యారన్నారు. ఎంపీ, అధికార పార్టీ ఎంఎల్‌ఎలు జిల్లాలో ఉపాధి అవకాశాలను పూర్తిగా విస్మరించారన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటైన మాల్స్‌లో కార్మికులకు చట్టబద్ధ సౌకర్యాలు కరువయ్యాయన్నారు. ఈ సభలో సిపిఎం రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారం, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ధనలక్ష్మి, ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, హరిబాబు, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్‌, సీనియర్‌ నాయకులు టిఎస్‌.ప్రకాష్‌, ఎస్‌ఎస్‌.మూర్తి, జిల్లా కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు, బి. రాజులోవ, టి.తులసి, ఎం.సుందరబాబు, కెవిఎస్‌.రామచంద్రరావు, మహిళా సంఘం నాయకులు బేబిరాణి, అన్నామణి తదితరులు పాల్గొన్నారు.
యాత్ర సాగింది ఇలా..
రాజానగరం నుంచి హైవే మీదుగా లాలాచెరువు సెంటరు చేరుకోగా అక్కడి నుంచి స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారులు డప్పులతో ఉత్సాహంగా ర్యాలీ ముందుకు సాగింది. సెంట్రల్‌ జైలు రోడ్డు, వై.జంక్షన్‌, స్టేడియం రోడ్డు, శ్యామలా సెంటర్‌లోని సిపిఎం కార్యాలయం వరకూ ర్యాలీ చేపట్టారు. అక్కడి నుంచి రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు ఎర్రజెండాలు చేతబూని కవాతు నిర్వహించారు.