ప్రజాశక్తి-గుంటూరు:జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ, నిబంధనలు సక్రమంగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టి నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణ నిబంధనల అమలు కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించిందని, క్షేత్రస్థాయిలో వీటి అమలును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. వైద్యశాలలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, పబ్లిక్ ప్రాంతాలలోనూ వారికి అనుకూలమైన విధంగా మౌలిక సౌకర్యాల కల్పనకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు సదరన్ సర్టిఫికెట్ల మంజూరుపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటానికి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటుకు డీసీహెచ్‌ఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక వైద్యవిభాగంలో స్పీచ్ థెరపి, బిహేవియర్ థెరపీ వైద్యుల నియమాకంకు ప్రతిపాదనలు అందించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, విభిన్న ప్రతిభాంతుల శాఖ ఏడీ సువార్త, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రావాణ బాబు, అధికారులు పాల్గొన్నారు.










