
చాలామంది చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోతారు. కాలికి చిన్న గాయమైనా, కడుపు నొప్పి వచ్చినా భూమ్యాకాశాలు ఏకం చేస్తారు. జీవితాల చివరి ఘడియల్ని వాటేసుకోవడానికి ఆతృత పడతారు. అలాంటి బలహీన మనస్కులు వీళ్లను చూసి ఎంతో నేర్చుకోవాలి. కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో, నవీన ఆవిష్కరణల్లో వైకల్యం అడ్డురాదని నిరూపించినవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కఠోర శ్రమతో ఎందరో విభిన్న ప్రతిభావంతులు జీవితాన్ని గెలిచారు. ఎందరినో గెలిపిస్తూ ఉన్నారు. అటువంటి విభిన్న వెలుగురేఖలు నాటి నుండి నేటి వరకూ విస్తరిస్తూనే ఉన్నాయి. వారి పట్టుదలను, అకుంఠిత దీక్షను, విజయాలను ప్రస్తావిస్తూ డిసెంబర్ 3న 'అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం'ను పురస్కరించుకుని సాగే స్ఫూర్తిదాయక కథనం..
సముద్ర కెరటాన్ని మించిన స్ఫూర్తివంతమైన పాఠం ఉంటుందా ? కెరటం కింద పడినా తిరిగి లేస్తుంది.. తీరాన్ని తాకేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది ! కెరటాన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనుషులూ ఉన్నారు.. నలుగురిలో ఒకరిగా కాకుండా నలుగురు గర్వించదగిన స్థాయికి ఎదగాలనే తపనతో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా గమ్యం చేరుకున్న విజేతలు ఉన్నారు. అలాంటి వారి విజయగాథలు..
ఆత్మవిశ్వాసమే ఆలంబన..

'కూర్చున్న చోటి నుంచి లేవలేకపోవడం శారీరక సమస్య అయితే... అలా లేవలేకపోవడానికి సరైన సహకారాన్ని అందించకపోవడమే అసలైన సామాజిక వైకల్యం' అని ఏనాడో ఐరిస్ అనే మహిళ చెప్పారు. ప్రతి వ్యక్తి వెనుకా ఆ సమాజం పాత్ర ఎంతైనా ఉంటుంది. దాని సహకారం, ప్రోత్సాహంతో ఎటువంటి వారైనా ఎంతటి ఉన్నత స్థితికైనా చేరవచ్చు. కానీ.. సామాజిక వైకల్యం పట్టిపీడిస్తున్న ఈ సమాజంలో కొందరు స్వశక్తితో ఎదిగి, ఉన్నత శిఖరాలను అధిరోహించారు. జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారుడు భీదోవెన్‌కు బ్రహ్మచెముడు. అయినప్పటికీ తన మధురమైన సంగీతంతో చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ప్రాచీన గ్రీకు మహాకవి హౌమర్ అంధుడు. మూగ, గుడ్డి, చెముడుతో చిన్నతనం నుంచే ఏకాకిగా మారిన హెలెన్ కెల్లర్ తన అమోఘ మేధోశక్తితో 'బ్రెయిలీ' లిపి నేర్చుకుని, పాండిత్యం సంపాదించారు. ఇక స్టీఫెన్ హాకింగ్ కదలడానికి సహకరించని అవయవాలు, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన శరీరం, మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం.. అయినా వైకల్యాన్ని ఎదిరించి, ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్తగా ఖ్యాతినొందారు. జాన్ మిల్టన్‌కు అంధత్వం ఉన్నా గొప్ప కవిగా మారడాన్ని ఆయన వైకల్యం ఆపలేకపోయింది. మనదేశం విషయానికొస్తే సుధా చంద్రన్, రవీంద్ర జైన్, గిరీష్ శర్మ, హెచ్.రామకృష్ణన్, ప్రీతి శ్రీనివాసన్, అరుణిమ సిన్హా, మాలతీ కృష్ణమూర్తిలాంటి వారెందరో ఆత్మవిశ్వాసం ఉంటే చేయలేనిదే లేదని నిరూపించారు. వైకల్యం శరీరానికేగానీ ప్రతిభకు, ఉన్నత లక్ష్యానికీ కాదని రుజువు చేశారు.
ఆటిజాన్ని అధిగమించిన ఐన్‌స్టీన్

ఆటిజంతో బాధపడుతూ గెలుపు దిశగా సాగిన అత్యంత విజయవంతమైన వ్యక్తుల జాబితాలో ఎవరైనా ఉన్నారంటే.. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆయన జర్మనీకి చెందిన గొప్ప భౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతిక శాస్త్రానికి మూలమైన రెండు సిద్ధాంతాల్లో ఒకటైన జనరల్ థియరీ ఆఫ్ రిలెటివిటీ (సాధారణ సాపేక్షత) ను ఆయన ప్రతిపాదించారు. భౌతికశాస్త్రం విస్తృతికి కృషి చేశారు. ఆయన సేవలకుగాను 1921లో నోబెల్ బహుమతి దక్కింది. ఇంత గొప్ప పేరుగాంచిన ఐన్‌స్టీన్ తన చిన్నతనంలో ఆటిజం బారిన పడ్డారు. ఆయన 1879 మార్చి 14న పుట్టిన కొద్దిరోజుల్లోనే తల్లిని భయపెట్టాడు. చాలా పెద్ద తల, వింత ఆకారం ఉన్న కొడుకును చూసి, ఆమె ఆందోళన చెందింది. దీనికి తోడు ఐన్‌స్టీన్ దేనికైనా చాలా ఆలస్యంగా స్పందించేవాడు. ఆయన మానసిక వైకల్యాన్ని చూసి తల్లి కుంగిపోయేది. తొమ్మిదేళ్ల వరకూ ఆయనలో ఈ లోపం ఎక్కువగా కనిపించింది. ఆ తరువాత ఆ వైకల్యాన్ని జయించి తన మేధో పటిమతో గొప్ప పేరు సంపాదించుకున్నారు.
స్ఫూర్తి శిఖరం హెలెన్ కెల్లర్

హెలెన్ కెల్లర్ అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథిగా ప్రపంచ స్థాయిలో పేరొందారు. ఎందరెందరికో స్ఫూర్తినిచ్చారు. ఊహ కూడా తెలియని వయస్సులోనే అనారోగ్య సమస్యకు గురయ్యారామె. చూపు, వినికిడి, మాట పోగొట్టుకొని వికలాంగురాలయ్యారు. ఈ ప్రపంచాన్ని సరిగా చూసింది లేదు.. ఏ శబ్దాన్ని విన్నదీ లేదు. అయినా అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్న వారందరికంటే మహోన్నత స్థాయిలో జీవించారు. విభిన్న ప్రతిభావంతుల కష్ట నిష్టూరాలపైనా, మహిళా హక్కులపైనా అనేకనేక పత్రికా రచనలు చేశారు. మహిళా హక్కుల సాధనకు స్వయంగా ఉద్యమాలు నడిపారు. 'ది స్టోరీ ఆఫ్ మై లైఫ్' గ్రంథ రచనతో తన పుస్తక రచనలకు శ్రీకారం చుట్టి, అనేక ప్రఖ్యాత రచనలను వెలువరించారు. వికలత్వానికి, అంధత్వానికీ మూలం పేదరికమని, అది లేని సమాజ స్థాపన ద్వారా వికలాంగుల సమస్యల పరిష్కారం సాధ్యమని నమ్మారామె. సమ సమాజ స్థాపన ద్వారానే వైకల్యాన్ని దూరం చేయవచ్చని దృఢంగా విశ్వసించి, వికలాంగుల ఉజ్వల భవిష్యత్తుకు విశేష కృషి చేశారు. హెలెన్ కెల్లర్ మూడు వైకల్య లోపాలతో బాధపడుతూ వాటిని అధిగమించిన తీరు అమోఘం. బ్రెయిలీ లిపి ద్వారా ఆమె విద్యార్జన చేశారు. శారీరక, మానసిక శక్తులన్నింటినీ కేంద్రీకరించి, చేతివేళ్ల సాయంతో తన మనోభావాలను ఎదుటి వారికి అర్థంకాగల రీతిలో చెప్పగలిగారు. ఆ తరువాత తానూ మాట్లాడటం నేర్చుకోవాలన్న తపనతో ఓ టీచర్‌ను నియమించుకున్నారు. ఆమె మాట్లాడుతుంటే ముఖం, పెదాలు, నాలుక, గొంతు నాళాలు ఏ విధంగా కదులుతున్నాయో తన చేతివేళ్లతో తడిమి తెలుసుకున్నారు. తానూ ఆ విధంగా అనుకరిస్తూ విపరీత శ్రమ చేసి, విజయం సాధించారు. రానురానూ ఆమె స్వరపేటిక చలించి, స్వరంలో స్పష్టత చేకూరింది. కొద్దికాలంలోనే మహా వక్త కాగలిగారు. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. 39 దేశాల్లో పర్యటనలు జరిపి సేవలందించారు.
పట్టుదలకు మారుపేరు లూయిస్ బ్రెయిలీ

అంధుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ. కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకు వన్నెలద్దినవారు. వైకల్యాన్ని జయించి.. అనుకున్న పనిని సాధించిన మహనీయులు. పారిస్‌లోని క్రూవే గ్రామంలో 1809 జనవరి 4న పుట్టారు. తన నాలుగో ఏటనే ప్రమాదవశాత్తు కంటిచూపు కోల్పోయారు. లైన్ టైపు పద్ధతితో చదువుకొని 17 ఏళ్లకే ప్రొఫెసర్ అయ్యారు. అంధులు సరళంగా చదువుకోవడం కోసం తనవంతుగా ఏదైనా చేయాలని పరితపించేవారు. పగలు ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తూ, రాత్రిళ్లు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకి కృషి చేశారు. అక్షరాలు నున్నగా కాకుండా చుక్కలుగా ఉండాలని భావించారు. ఆరు చుక్కలతో అక్షరాలను, పదాలను చదివేలా ఉబ్బెత్తు అక్షర లిపిని రూపొందించారు. నేటికీ అంధులకు అన్నిరకాల పత్రికలు, పుస్తకాలు బ్రెయిలీ లిపిలోనే రూపొందిస్తున్నారు.
స్వర చక్రవర్తి.. రవీంద్ర జైన్

ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్ పుట్టుకతోనే అంధుడు. ఆయన 1944, ఫిబ్రవరి 28న ఆలిఘర్‌లో జన్మించారు. ఆయనకు బాల్యం నుంచే సంగీతంపై అభిరుచి. తొలుత జైనుల భజన పాటలు పాడేవారు. ఆ తరువాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 1960లో సినీ పరిశ్రమవైపు మళ్లారు. ఆయన సంగీత దర్శకత్వం వహించిన 'చోర్ మచాయే షోర్, గీత్ గాతా చల్, చిత్ చోర్, ఆంకియోం కె జహారోకోన్ సే, సౌదాగర్, రాం తేరీ గంగా మైలీ' సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. ఆయన వివిధ భాషల్లో సుమారు 175 సినిమాలకు పైగా సంగీతం అందించారు. తెలుగులో 'దాసి', కీర్తిశేషులు ఎన్‌టిఆర్ నటించిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమాలకు సంగీత దర్శకులు ఆయనే. ప్రముఖ గాయకుడు జేసుదాసును బాలీవుడ్‌కు పరిచయం చేసినదీ రవీంద్రజైనే. సుమారు మూడు దశాబ్దాల పాటు 'రామాయణ్, లవ్ కుష్, నుపూర్, విమెన్ ఆఫ్ ఇండియా, ఊర్వశి' వంటి అనేక టీవీ సీరియల్స్‌కి సంగీతం అందించారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు, పద్మశ్రీ అవార్డు దక్కాయి.
కొత్త చరిత్ర లిఖించిన అవనీ లేఖరా

పారాలింపిక్స్‌లో పతకం సాధించాలని అథ్లెట్లు కలలుగంటారు. అలాంటిది షూటర్ అవనీలేఖరా ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి 19 ఏళ్లకే దిగ్గజంగా మారారు. టోక్యోలో ఒక పసిడి, కాంస్యం ఆమె ఖాతాలో చేరాయి. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా పారాలింపియన్‌గా ఆమె నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవనీకి 2012లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది. తీవ్ర నిరాశలో ఉన్న ఆమెను తండ్రి ప్రవీణ్ జగత్‌పురా షూటింగ్ రేంజ్‌లో 2015లో చేర్చారు. ఆమె ఆ క్రీడపై అమితాసక్తి కనబరించారు. ఆ ఉత్సాహాన్ని గమనించిన తండ్రి.. అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ పుస్తకం ఇచ్చారు. అది చదివాక తాను మంచి షూటర్‌గా మారాలని అవనీ నిర్ణయించుకున్నారు. కఠోర సాధనతో తన కలను నిజం చేసుకున్నారు.
జీవితానికి సవాల్.. సుధా చంద్రన్

సుధా చంద్రన్ - నాట్య మయూరిగా కీర్తి గడించిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి. జీవితాన్ని ఛాలెంజ్ చేసి తనను తాను మలచుకున్న ధీరురాలు. ప్రతికూల పరిస్థితులకు ఎదురీది సినీ, టీవీ రంగాల్లో తనదైన ప్రతిభ చూపారామె. 'ఈ పాదం నటరాజ కీర్తగానం..' అంటూ 'మయూరి' మూవీలోని తన నాట్య ప్రతిభతో తెలుగువారిని మంత్ర ముగ్ధుల్ని చేశారు. భారతీయ నృత్యంలో విశేషమైన ప్రతిభను ప్రదర్శించిన ఆమె.. 1981లో తిరుచిరాపల్లి వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయారు. అయినా జీవితం ఇంతటితో సరి అని ఊరుకోలేదు. జైపూర్ పాదం అమర్చుకుని, దాంతోనే నాట్యంలో సాధన చేసి 'నాట్య మయూరి' అనిపించుకున్నారు.
హాస్యనటునిగా.. నూతనప్రసాద్

తనదైన డిక్షన్‌తో, బాడీ లాంగ్వేజ్‌తో తనకంటూ చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నూతన ప్రసాద్. విభిన్న పాత్రలను పోషించారు. ఆయన నటనాశక్తితో ప్రేక్షకులను కట్టిపడేసేవారు అంటే అతిశయోక్తి కాదేమో! ఆయన పోషించిన పాత్ర మాత్రమే తెరపై కనిపించేది. ఆయన కనిపించేవారు కాదు. అంతలా నటనలో జీవించేవారు. సునిశితమైన హాస్యంతో విలనిజాన్ని పండించిన ఘనత నూతన ప్రసాద్‌కే దక్కుతుంది. 'బామ్మమాట బంగారు బాట' సినిమా షూటింగ్ సమయంలో 1989లో ప్రమాదానికి గురై, వీల్‌చైర్‌కే పరిమితమైనా, ఆ తరువాతనూ సినీ రంగాన్ని వీడలేదు. జడ్జి పాత్రల్లో ఎక్కువగా నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందారు. నంది, ఎన్‌టిఆర్ అవార్డు అందుకున్నారు.
ఇలా అనేక వెలుగురేఖలు నాటి నుండి నేటి వరకూ విస్తరించి ఉన్నాయంటే అతిశయక్తి కాదు. ఇలా ఓవైపు వైకల్యం బాధిస్తున్నా, తనకు ఎవరూ సాటిలేరు అన్న ఆత్మస్థైర్యంతో కార్టూన్ రంగంలోనూ అడుగెట్టారామె. తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చేతులు లేకపోయినా.. నోటితో కుంచె పట్టుకుని అద్భుతమైన పెయింటింగ్స్‌ను సృష్టిస్తున్నారు కొలంబియాకు చెందిన జూలీ శాంగినో. ఎవరెస్టు వంటి మహా శిఖరాలను అధిరోహించారు అరుణిమ సిన్హా.. ఇలా ఎందరో వికలాంగులు తమతమ లోపాలను అధిగమించి, వివిధ రంగాల్లో విశేషంగా రాణిస్తున్నారు. వాళ్ళు కోరుకునేది సమాజం నుంచి దయ, జాలి కాదు. అభివృద్ధి పథంలో తమకూ సరైన స్థానం ఉండాలన్నదే వారి విన్నపం. అది న్యాయమైన కోరికేనని అందరూ గుర్తించాలి.
ధైర్యశాలి.. స్టీఫెన్ హాకింగ్..

ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ జీవితం ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. తన మొక్కవోని ధైర్యంతో మనుగడ సాగించడమే కాకుండా ప్రపంచం మర్చిపోలేని పరిశోధనలు చేశారాయన. మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా, ఆయన ఖగోళ శాస్త్రంలో పరిశోధనలు చేసి విశ్వవిఖ్యాతి గడించారు. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అయిన ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యునిగా పనిచేశారు. ఆయన ప్రతిపాదించిన బ్లాక్ హోల్స్ రేడియేషన్‌ను హాకింగ్ రేడియేషన్‌గా పిలుస్తున్నారు. కృష్ణబిలాలు, వర్మ్ హోల్స్, గ్రహాంతరవాసులు, క్వాంటమ్ మెకానిక్స్, టైమ్ ట్రావెల్.. మొత్తానికి ఓ కాలం చరిత్రను కథలా చెప్పేసిన మహా శాస్త్రవేత్త. రెండు చక్రాల కుర్చీలో కూర్చునే.. విశ్వాన్నంతటినీ శోధించారు. మాట పెదవి దాటలేనంతగా వైకల్యం కుదించేసినా కృత్రిమ పరికరంతో శాస్త్ర విజ్ఞానాన్ని కుదిపేసే సిద్ధాంతాలను వెలువరించారు. మెదడులోనే విశ్వ విద్యాలయాన్ని తెరచి విశ్వ రహస్యాన్ని ఛేదించారు. ఆయన జీవితం ఆధారంగా తీసిన 'ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్' చిత్రానికి ఆస్కార్ అవార్డులు వస్తే లక్షలాది మందిలో వైకల్యాన్ని తరిమేసే ఆత్మ విశ్వాసం రివార్డు అయింది.
న్యాయవాదిగా, ఎంపీగా.. సాధన్ గుప్తా

నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ భ్లైండ్ తొలి అధ్యక్షునిగా, డిసేబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్ ఇండియా ఛాప్టర్ వ్యవస్థాపక అధ్యక్షునిగా, పశ్చిమ బంగా రాజ్య ప్రతిబంధి సమ్మిళిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా విశేష సేవలందించారు సాధన్ గుప్తా. తన 15 నెలల వయస్సులోనే అనారోగ్య కారణంతో చూపు కోల్పోయారు. తెలివైన విద్యార్థి. న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన ఆయన 1947లో బార్ కౌన్సిల్‌లో చేరారు. తన కళాశాల రోజుల్లోనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు. బెంగాల్ ప్రొవిన్షియల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షునిగానూ పనిచేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ తరపున కోల్‌కతా తూర్పు నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై, విశేష సేవలందించారు. రెండు పర్యాయాలు పశ్చిమ బంగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1986లో పశ్చిమ బంగా అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలో తొలి అంధ ఎంపీగా సేవలందించిన ఆయన ఎందరికో స్ఫూర్తి.

కోడూరు అప్పలనాయుడు
94915 70765