Nov 29,2020 12:51

అన్నిరకాలుగా ఆరోగ్యంగా ఉండి.. అవకాశాలు, సౌకర్యాలు ఉన్న వ్యక్తి విజయం సాధిస్తే అది అంత చెప్పుకోవాల్సిన అంశం కాదు.. కానీ వైకల్యంతో అవరోధాలను, అసౌకర్యాలను ఎదుర్కొంటూ.. జీవన సోపానాలుగా మలుచుకోవడమే విశేషం. అలాంటివారు చరిత్రలో నిలిచిపోవడమే కాదు.. ఎందరికో స్ఫూర్తినిస్తారు. నాటి ఐన్‌స్టీన్‌, న్యూటన్‌, లూయిస్‌ బ్రెయిలీ, హెలెన్‌ కెల్లర్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ నుంచి నేటి నిక్‌ ఉయిచిచ్‌, ఇరా సింఘాల్‌, సుధాచంద్రన్‌, తంగవేలు, ప్రాంజల్‌ పాటిల్‌ ఇలా ఎవరి జీవితాన్ని తీసుకున్నా స్ఫూర్తిదాయకమే. వీరే కాదు మనకు రోజూ కనిపించే విభిన్న ప్రతిభావంతులూ బతుకుపోరులో విజయాలు సాధిస్తున్నారు. వైకల్యం వెక్కిరించినా మొక్కవోని లక్ష్యంతో ముందుకే కదులుతున్నారు. కృత్రిమ అవయవాల సహాయంతో లోకానికి సవాలు విసురుతున్నారు. శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నిరూపిస్తున్నారు. విభిన్న ప్రతిభావంతుల విజయగాథను తెలుపుతూ సాగేదే ఈ వారం అట్టమీది కథనం..
 

'విభిన్న' శిఖరాలు



వైకల్యం.. ప్రపంచంలో కోట్ల మందిని ఏదో ఒక రూపంలో అశక్తులను చేస్తున్న సామాజిక సమస్య. శారీరకంగా లేదా మానసికంగా సాధారణ జీవనం సాగించలేని నిస్సహాయ స్థితి వీరందరిదీ. ఇలాంటివారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. మానవ శరీరంలో దైనందిన కార్యక్రమాలు చేసుకునేందుకు అవసరమైన ఏ అవయవం పనిచేయకపోయినా వాళ్లు విభిన్న ప్రతిభావంతులే. ఐక్యరాజ్యసమితీ దీనినే ధృవీకరించింది. ప్రతి ఏడాది ఈ దినోత్సవాన్ని డిసెంబర్‌ 3న జరుపుకుంటారు. కోవిడ్‌- 19 నేపథ్యంలో వారి జీవనం గడపడానికి సులభ మార్గాలను తెలపడమే ఈ ఏడాది లక్ష్యం. వైకల్యం అనే పదానికి వివిధ దేశాలు పలు నిర్వచనాలు ఇచ్చుకున్నాయి. చైనా, బ్రిటన్‌ వంటి దేశాలు మంచి నిర్వచనాలు ఇవ్వడమే కాకుండా వారి సంక్షేమానికీ పెద్దపీట వేశాయి. కేవలం వైద్యుని నిర్ధారణతో మాత్రమే మనదేశంలో వైకల్యాన్ని చూస్తున్నారు. 40 శాతం వైకల్యం కన్నా ఎక్కువగా ఉంటేనే ఇక్కడ ప్రభుత్వ పథకాలకు అర్హులు. ఇది ఎంతోమంది ఎదుగుదలకు పెద్ద అవరోధం.

మన దేశంలో 21 రకాల వైకల్యాలతో బాధపడుతున్నారు. చలన వైకల్యం, అంధత్వం, కుష్టు, దృష్టి లోపం, వినికిడి లోపం, మరుగుజ్జుతనం, బుద్ధిహీనత, మానసిక సమస్యలు, ఆటిజం, సెరిబ్రల్‌ పాల్సీ, మస్కులర్‌ డిస్టోప్రీ, నాడీ సంబంధిత సమస్యలు, స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిజేబిలిటీ, మల్టిపుల్‌ స్లెరోసిస్‌, మాట్లాడలేకపోవడం, తలసేమియా, హిమోఫిలియా, సికెల్‌ సెల్‌ డిసీజ్‌, మల్టిపుల్‌ డిజేబిలిటీస్‌, యాసిడ్‌ దాడి బాధితులు, పార్కిన్సన్‌ బాధితులు మన దేశంలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన నిర్వచనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్‌ (వంద కోట్ల) మంది బాధితులు ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలుపుతోంది. అంటే ప్రపంచ జనాభాలో వీరిది 15 శాతం అన్నమాట. దేశాల వారీగా చూస్తే అమెరికాలో 12%, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో18%, జర్మనీలో 9%, శ్రీలంకలో 5%, పాకిస్తాన్‌లో 9 శాతం వరకూ విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు. మనదేశంలో ఈ సంఖ్య 2.1 శాతం (2 కోట్లా 19 లక్షల మంది) గా, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో 13 లక్షల పైచిలుకుగా ఉంది.

అవహేళన.. వివక్ష
ఇప్పటికీ చాలాచోట్ల విభిన్న ప్రతిభావంతులను 'కుంటోడు, సొట్టోడు, గుడ్డోడు, మెల్లోడు, చెవిటోడు, పిచ్చోడు, గూనోడు, కబోది' అని పిలుస్తూ అవహేళన చేస్తున్నారు. ఇవి వారిని మరింత కుంగదీస్తున్నాయి. విభిన్న ప్రతిభావంతుల గణనపై భారత్‌లో తీవ్ర వివక్ష కొనసాగుతోంది. జనాభా లెక్కల ప్రకారం 2.1 శాతంగా వీరు ఉన్నారు. 11వ పంచవర్ష ప్రణాళిక గతంలో రూపొందించిన నివేదిక ప్రకారం వీరు ఆరు శాతంగా ఉన్నారు. రెండోదాన్నే వికలాంగ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బలపరుస్తున్నాయి. మనదేశ విభిన్న ప్రతిభావంతుల్లో 75 శాతం మంది గ్రామీణ ప్రాంతాలవారే. వీరి అక్షరాస్యత కేవలం 49 శాతమే. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కన్నా విభిన్న ప్రతిభావంతులు ఐదు శాతం తక్కువగా పాఠశాలలకు వెళుతున్నారు. పలు సర్వేలను, జన గణనను ప్రభుత్వం నిర్వహిస్తున్నప్పటికీ.. విభిన్న ప్రతిభావంతుల కోసం ఓ బ్లాక్‌ను కేటాయించినప్పటికీ.. 90% మంది అధికారులు, సర్వే సిబ్బంది ఆ ఖాళీని పూరించడం లేదని ఆధారాలతో సహా వెల్లడైంది. ప్రభుత్వాలు క్రమేపీ బడ్జెట్‌ కేటాయింపులను తగ్గిస్తూ సంక్షేమ పథకాలను కుదించేస్తున్నాయి. దీంతో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం స్వచ్ఛంద సంస్థలు, కుటుంబసభ్యుల మీద ఆధారపడి సాగుతోంది. వికలాంగుల చట్టం - 2016లోని నాలుగు శాతం రిజర్వేషన్లు ఎక్కడా అమలుకావడం లేదు. దీంతో వీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరు 0.50 శాతంగానే ఉన్నారు. మరోపక్క ప్రయివేటు కంపెనీల్లో వీరు 0.28 శాతం మంది మాత్రమే ఉద్యోగులుగా ఉన్నారు. ఈ సంఖ్యలే వీరు సమాజానికి ఎంత దూరంగా ఉన్నారో చెబుతున్నాయి. చట్టసభల్లో వీరి ప్రాతినిధ్యం అతి స్వల్పమనే చెప్పాలి.

కల్యాణమూ కష్టమే
సాధారణ మహిళల కంటే విభిన్న ప్రతిభావంతులైన మహిళలు మూడు రెట్లు ఎక్కువ వివక్షకు, లైంగికదాడులకు గురవుతున్నారు. అంగవైకల్యం పురుషులకు ఉపాధి ఉంటే, సకలాంగ యువతులు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే మహిళా విభిన్న ప్రతిభావంతుల పరిస్థితి అలా లేదు. ఎంతో ఆర్థిక స్థోమతున్న మహిళ విభిన్న ప్రతిభావంతురాలైతే తప్ప ఆమెకు వివాహం కావడం లేదు. దీనితో అత్యధికులు అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. లేదంటే వయస్సు మీరిన వారిని వివాహం చేసుకుని, చిన్న వయస్సులోనే ఒంటరిమహిళలు అవుతున్నారు. విభిన్న ప్రతిభావంతుల్ని ఎవరైనా సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం ఇచ్చే నగదు ప్రోత్సాహకాల అందజేతలోనూ తీవ్ర జాప్యం నెలకొంటోంది.

హక్కులు- చట్టాలు
విభిన్న ప్రతిభావంతులకు సమాన అవకాశాలు, హక్కులు కల్పించడం ద్వారా మానసిక, శారీరక, శక్తి సామర్థ్యాల్ని సమాజాభివృద్ధిలో మిళితం చేయాలని ఐక్యరాజ్యసమితి భావించింది. 1981 నుంచి డిసెంబర్‌-3వ తేదీని 'అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం'గా ప్రకటించింది. ఇందులో భాగంగానే అనేకదేశాలు విభిన్న ప్రతిభావంతులను విలువైన మానవ వనరులుగా గుర్తించి, వారికి అనేక చట్టాలు, హక్కులు కల్పించాయి. ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌, అమెరికా, కెనడా, యూరప్‌ తదితర దేశాల్లో వీరి హక్కులను పక్కాగా అమలుపరిచి, వాటి ఫలితాల వల్ల అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. కానీ భారత్‌లో దీనికి భిన్నమైనస్థితి.

మన దేశంలో..
మెంటల్‌ హెల్త్‌ యాక్ట్‌ :
మానసిక వికలాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈ చట్టాన్ని 1993లో రూపొందించారు. దీని ప్రకారం వికలాంగులకు రక్షణ, పునరావాస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్వర్యంలో సంస్థల్ని ఏర్పాటు చేస్తారు.

విభిన్న ప్రతిభావంతుల చట్టం 2016 :

ఈ చట్టం అందరిలో కొత్త ఆశలు చిగురింప జేసింది. విభిన్న ప్రతిభావంతుల విద్యాహక్కు, ఉపాధి, గుర్తింపు, సంస్థల స్థాపన, వివక్ష నిర్మూలన, ఉద్యోగ భద్రత, పరిశోధన, మానవ వనరుల అభివృద్ధి, సాంఘిక చైతన్యం, ఎన్‌జిఒల గుర్తింపు, వీరి కోసం పనిచేసే సంస్థల ఏర్పాటు.. ఇందులో పొందుపరిచారు. ఉద్యోగాల్లో నాలుగు శాతం, విద్యా, ఇతరత్రా పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి. పై చట్టాలతో పలు పథకాలు అమల్లో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో.. బస్సుల్లో విభిన్న ప్రతిభా వంతులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. జిల్లాల్లో టిక్కెట్‌పై 50 శాతం రాయితీ కల్పించారు. రైల్వేలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయా ణం చేయొచ్చు. వారితో ప్రయాణించే వారికీ 50 శాతం రాయితీ అంది స్తు న్నారు. ఇవేకా కుండా పింఛన్లు, వైకల్యోపకరణాలు, రుణాలు అందిస్తున్నారు. పలు వసతిగృహాలు నడుస్తున్నాయి. స్కాలర్‌షిప్పులు అందిస్తున్నారు. వాహనాలు, ర్యాంపు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయితే విభిన్న ప్రతిభావంతుల నిష్పత్తికి తగ్గట్టుగా వీటిని అమలు చేయడంలో వైఫల్యం ఉంది.

కారణాలు
అంగవైకల్యం, పేదరికం, అనారోగ్యం వీటి మధ్య అంతర్గత సంబంధం ఉంది. పేదరికం వల్ల పోషకాహారం అందుబాటులో ఉండదు. ఇది అనారోగ్యానికి, ఆపై అంగవైకల్యానికి దారితీస్తుంది. మేనరికపు వివాహ సంబంధాలూ ఓ కారణం. గర్భిణులకు ఆరోగ్య వసతులు లేకపోవడమూ వైకల్య శిశువుల జననానికి ఆస్కారమిస్తోంది. ఐరన్‌, అయోడిన్‌, పోలిక్‌యాసిడ్‌ లోపాలు, వ్యాధులు, ప్రమాదాలు అంగవైకల్యానికి కారణాలు.

ఐఎఎస్‌ టాపర్‌నూ వీడని వివక్ష
ఇరా సింఘాల్‌ది ఢిల్లీ. తండ్రి పేరు రాజేంద్ర సింఘాల్‌, తల్లి అనితా సింఘాల్‌. 2010 సివిల్స్‌లో ఇరా కు 815 ర్యాంకు వచ్చింది. ఆ ర్యాంకుకు ఐఆర్‌ఎస్‌ వస్తుంది. కానీ సిబ్బంది శిక్షణా విభాగం (డిఒపిటి) ఆ ఉద్యోగాన్ని అడ్డుకుంది. సాక్షాత్తూ ఓ ఉద్యోగి ఆమెను ఉద్దేశించి 'అటెండర్‌పనికి కూడా పనికిరావు' అని అవహేళనగా మాట్లాడారు. కానీ చిన్నప్పటి నుంచి 'ప్రపంచం వెనుకాల నువ్వు వెళ్లడం కాదు.

'విభిన్న' శిఖరాలు

ప్రపంచమే నీ కాళ్ల దగ్గరకు రావాలి. అదే అసలైన విజయం' అన్న మాటను చెబుతూ వస్తున్న ఇరా.. అన్నట్లుగానే సివిల్స్‌లో మొదటి ర్యాంకు సాధించారు. అలాగే అంధుడైన అజిత్‌కుమార్‌ను, బధిరుడైన మణిరామ్‌ శర్మనీ వివక్ష వీడలేదు. అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, ఐఎఎస్‌కు ఎంపికైనా దేశీయ నిబంధనలు వీరిని ఇబ్బందుల పాల్జేశాయి. అయినా ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేసి, ఐఎఎస్‌ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు.

అరుణిమ ముందు చిన్నబోయిన ఎవరెస్టు
మృత్యువు అంచుల్లో నిలబడి, ఆఖరి శ్వాసలో విజయగీతం ఆలపించిన యువతి అరుణిమా సిన్హా. ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆమె.. వాలీబాల్‌, పుట్‌బాల్‌ క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించారు. 2011 ఏప్రిల్‌ 11న ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకు రైలులో బయలుదేరారు. ఆమె ప్రయాణిస్తున్న జనరల్‌ బోగీలోకి కొందరు దుండగులు ప్రవేశించి, నగదును దోచుకోవడానికి ప్రయత్నించారు.

'విభిన్న' శిఖరాలు

అప్పుడు ఆమె తీవ్రంగా ప్రతిఘటించారు. అంతే దుండగులు ఒక్కసారిగా ఆమెను రైలులో నుంచి బయటకు విసిరేశారు. అంతే పక్కనున్న పట్టాలపై పడిపోయారామె. అప్పుడే అటుగా వస్తున్న రైలు ఆమె రెండుకాళ్లపై నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె కృత్రిమ కాళ్లు అమర్చుకుని, ఎవరెస్టు శిఖరం ఎక్కాలని నిశ్చయించుకుంది. 52 రోజులపాటు ఎముకలు కొరికే చలిలో ప్రయాణించి.. 2013, మే 21 నాటికి శిఖరాగ్రాన్ని చేరింది. ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరాన్ని అధిరోహించిన విభిన్న ప్రతిభావంతురాలిగా చరిత్రకెక్కింది.

'విభిన్న' శిఖరాలు


అమ్మకు చేదోడుగా..
ఐదేళ్ల వయస్సులోనే బస్సు ప్రమాదంలో అతను ఒక కాలు పోగొట్టుకున్నాడు. ఒంటరి మహిళ అయిన తల్లికి చిన్నప్పటి నుంచే చేదోడు వాదోడుగా ఉన్నాడు. 2016లో రియోలో జరిగిన పారా ఒలింపిక్స్‌లో ఫైనల్లో 1.89 మీటర్లు ఎత్తు ఎగిరి, హై జంప్‌లో బంగారు పతకాన్ని సాధించాడు. అతనే తమిళనాడుకు చెందిన మరియప్పన్‌ తంగవేలు. ఒకవైపు చదువులో.. మరోవైపు కృత్రిమ కాలుతోనే క్రీడల్లో రాణిస్తూ ప్రపంచం మెచ్చే క్రీడాకారునిగా ఎదిగాడు.

'విభిన్న' శిఖరాలు


తొలి అంధ ఐఎఎస్‌ ప్రాంజల్‌
మహారాష్ట్రకు చెందిన ప్రాంజల్‌ పాటిల్‌ దేశంలోనే తొలి అంధ ఐఎఎస్‌ అధికారిగా రికార్డు లకెక్కారు. కేరళ రాజధాని తిరువనంతపురం సబ్‌ కలెక్టరుగా తొలి బాధ్యతలు స్వీకరించారు. ఐఎఎస్‌ కావాలన్న ఆమె లక్ష్యానికి అంధత్వం ఏమాత్రం అడ్డంకి కాలేదు. 2017 సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో 124వ ర్యాంకు సాధించి, అందరి చూపునూ తనవైపు మరల్చుకున్నారు.

ఆదర్శ శిఖరం.. స్టీఫెన్‌ హాకింగ్‌
కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి, మాట్లాడటానికి కంప్యూటర్‌ సహాయం.. ఇవీ ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్‌ న్యూరాన్‌ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా.. చేస్తున్న పనికి శరీరం సహకరించకపోయినా... కృష్ణ బిలాలపై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చూపాయి.

ఆదర్శ శిఖరం.. స్టీఫెన్‌ హాకింగ్‌

శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకునే తత్వం అందరికీ ఆదర్శం. సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా పేరుగాంచిన ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో గణితశాస్త్ర ఆచార్యునిగా విశేష సేవలందించారు. రాయల్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో గౌరవ సభ్యుడిగా, పాంటిఫికల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో జీవితకాల సభ్యునిగా పనిచేశారు. అమెరికా అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ అందుకున్నారు. ఆయన 2018, మార్చి 14న మనందరికీ భౌతికంగా దూరమయ్యారు.

సినిమాలకు కాసుల వర్షం
అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ రెండింటిలోనూ వైకల్య ఆధారిత సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. 'బర్ఫీ, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌, తారే జమీన్‌ పర్‌, బ్లాక్‌, ఇక్బాల్‌, కోయి మిల్‌గయా, ఆంకెన్‌, సద్మా, ఫా, బజరంగీ భాయిజాన్‌' తదితర సినిమాలు బాలీవుడ్‌లో కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. తెలుగులో వచ్చిన మయూరి, ఆరాధన, ప్రేమించు, సిరివెన్నెల అద్భుత కళాఖండాలుగా నిలిచిపోయాయి. రవితేజ అంధునిగా నటించిన 'రాజా ది గ్రేట్‌' కూడా ఆ మధ్య అందరినీ ఆకట్టుకుంది. ఇవే కాదండోరు విభిన్న ప్రతిభావంతుల సన్నివేశాలున్న సినిమాలనూ ప్రేక్షకులు ఎక్కువ ఆదరించారు.

ఆదర్శ శిఖరం.. స్టీఫెన్‌ హాకింగ్‌


వీళ్లూ.. తక్కువ కాదు!
జర్సికా పట్టుదలకు మారుపేరు. చేతుల్లేకుండానే పుట్టారామె. అయితేనేం కాళ్లతో విమానం నడిపిన ఏకైక పైలెట్‌గా గిన్నిస్‌ రికార్డు సాధించారు. గద్వాల రాజు ప్రమాదంలో చేతివేళ్లను పోగొట్టుకున్నా కుంచె పట్టుకుని, ఆత్మస్థైర్యంతో అంగవైకల్యం శరీరానికేగానీ మనసుకు కాదంటూ చాటి చెప్పారు. పోలియోతో రెండు కాళ్లూ పోగొట్టుకున్న పద్మప్రియ రంగస్థలంపై అందరినీ మెప్పించి రాష్ట్రపతి అవార్డుతో సహా ఎన్నో అవార్డులను గెలిచి, ఆదర్శంగా నిలిచారు. విజయవాడకు చెందిన అంధురాలైన సుబ్బలక్ష్మి లలిత సంగీతంలో ఉన్నతంగా నిలిచి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరో కళాకారిణి స్వాతి చూపులేకపోయినా యాంకరింగ్‌ చేస్తూ టీవీ ఛానళ్లలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

నాట్య 'మయూరి' సుధా చంద్రన్‌
కేరళకు చెందిన సుధా చంద్రన్‌ భారతీయ భరత నాట్య నృత్యకారిణి, నటి. 1981లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె ఒక కాలును కోల్పోయారు. అనంతరం కృత్రిమ కాలిని అమర్చుకున్నారు. దానితోనే నాట్య ప్రదర్శనలు ఇచ్చి, అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశారు. వేల ప్రదర్శనలతో వందలాది అవార్డులను అందుకున్నారు. తెలుగులో తన జీవితగాథను ఆవిష్కరించే 'మయూరి' సినిమాతో నట ప్రస్థానాన్నీ ప్రారంభించారు.

ఆదర్శ శిఖరం.. స్టీఫెన్‌ హాకింగ్‌