Sep 01,2023 01:00

ప్రజాశక్తి-గుంటూరు : ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా, మెరిట్‌ ప్రాతిపదికన అర్హత ఉన్న అభ్యర్డులను ఎంపిక చేశామని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌లో ఉద్యోగాలు పొందిన విభిన్న ప్రతిభావంతులకు గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారితో కలసి నియామక ఉత్తర్వులు అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 49 విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల ఖాళీల భర్తీ కోసం స్పెషల్‌ నియామక నోటిఫికేషన్‌ జారీ చేసి, దరఖాస్తులు స్వీకరించినట్లు చెప్పారు. 49 పోస్టులలో 13 పోస్టులకు అర్హత వున్న వారి నుండి దరఖాస్తులు అందలేదని, 8 పోస్టులకు లోకల్‌ అభ్యర్థుల క్లారిఫికేషన్‌ కోసం ప్రభుత్వానికి పంపించామన్నారు. మెరిట్‌ జాబితాలో ఎంపిక చేసిన 11 మందికి సంబంధించి మెడికల్‌ బోర్డు, ఇతర అంశాలకు సంబంధించి క్లియరెన్స్‌ పెండింగ్‌లో వుండడం వలన 17 మందికి నియామక ఉత్తర్వులు అందించినట్లు చెప్పారు. మిగిలిన వారికి కూడా త్వరలో నియామక ఉత్తర్వులు అందిస్తామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ కె.చంద్రశేఖర్‌రావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సువార్త అభ్యర్థులు పాల్గొన్నారు.