ప్రజాశక్తి రావికమతం:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉచితంగా అందిస్తున్న సేవలు, సదుపాయాలను విభిన్న ప్రతిభా వంతులు సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి. శకుంతల కోరారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభ వంత విద్యార్థులకు రగ్గులను రావికమతం భవిత కేంద్రంలో శుక్రవారం పంపిణీ చేశారు.చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన రెడ్డి సన్యాసినాయుడు, చోడవరం గ్రామానికి చెందిన జూరెడ్డి ప్రకాష్‌లు పది వేల రూపాయలు విలువ చేసే 60 రగ్గులను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి. శకుంతల మాట్లాడుతూ, రగ్గులను వితరణ చేసిన రెడ్డి సన్యాసినాయుడు, ప్రకాష్‌లను అభినందించారు. దాత రెడ్డి సన్యాసినాయుడు మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు సేవ చేయడం గొప్ప అదృష్టమని అన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా రన్నింగ్, క్యారమ్స్, మ్యూజికల్ చైర్, డ్రాయింగ్, లాంగ్ జంప్ వంటి పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి రాము, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మి నాయుడు, జగన్నాథ నాయుడు, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










