ప్రజాశక్తి - బలిజిపేట : మండలంలోని గలావిల్లికి చెందిన విఆర్‌ఒ రాంబాబు అవినీతిపై తహశీల్దార్ పి.అప్పలరాజుకు గ్రామస్తులు రఘుమండల నాగేశ్వరరావు తదితరులు ఫిర్యాదు చేశారు. ఐదేళ్ల క్రితం 12 సర్వే నెంబర్లలో గల సుమారు రెండు ఎకరాల భూమికి సంబంధించిన ముటేషన్ కోసం రూ.3వేలు లంచం తీసుకుని.. నాటి నుండి నేటి వరకు ఆ పని చేయలేదని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు అడిగితే ఆ భూములు మీకు ఎవరెవరు అమ్మారో అప్పటి వివరాలు కావాలనే ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకుంటున్నారని వాపోయారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని తహశీల్దార్‌ను కోరారు.
రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి : జనసేన
మండలంలోని గలావల్లిలో రెవెన్యూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జనసేన నియోజకవర్గ నాయకులు అక్కివరపు మోహనరావు, పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు తహశీల్దార్‌ను కోరారు. రీ సర్వే విషయంలో తమకు సమాచార హక్కు చట్టం ప్రకారం పూర్తి వివరాలు అందజేయాలని, అక్కడున్న రైతుల భూములు, ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల విషయాలు తెలియజేయాలని కోరారు. అవినీతి కాల్పడిన విఆర్‌ఒపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి గంట్యాడ స్వామినాయుడు, జిల్లా నాయకులు అప్పలనాయుడు, వెంకటరమణ, మార్కండేయ, తెర్లాం మండలం జనసేన మండల అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు.
పిడుగుపాటుకు దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలి
పిడుగులతో కూడిన వర్షాలకు మండలంలోని చెల్లంపేట, మిర్తివలస, అంపావిల్లి, నూకలవాడ, నారాయణపురం గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు దెబ్బతిన్నాయని, వీటిని వెంటనే పునరుద్ధరించాలని జనసేన నియోజకవర్గం నాయకులు అక్కివరపు మోహన్‌రావు విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారం రోజులు కిందట అకాల వర్షానికి పిడుగులు పడి ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తినడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఈ నష్టం నుండి రైతులను ఆదుకోవాలని కోరారు. దీనికి ఏఈ స్పందిస్తూ వీలైనంత త్వరగా కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బలిజిపేట మండల నాయకుడు బంకురు పోలినాయుడు, పరుచూరి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.










