Feb 14,2023 21:51

డిఆర్‌ఓ కు వినతిపత్రం ఇస్తున్న వీఆర్‌ఏల సంఘం నాయకులు.. ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, సిఐటియూ నాయకులు

విఆర్‌ఎలకు ఫేస్‌ యాప్‌ రద్దు చేయాలి
- రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలి
- కలెక్టరేట్‌ ముందు సిఐటియు ఆధ్వర్యంలో విఆర్‌ఎలు ధర్నా
- సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      విఆర్‌ఎలకు తీసుకొచ్చిన ఫేస్‌ యాప్‌ హాజరును తక్షణమే ఉపసంహరించుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి.యేసురత్నం, ఎ.నాగరాజు, విఆర్‌ఎల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నగేష్‌, భూపాల్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో విఆర్‌ఎలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విఆర్‌ఎలలో ఎక్కువ మంది వయస్సు రీత్యా సచివాలయాలకు, తహశీల్దార్‌ ఆఫీసులకు వచ్చి ఫేస్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. తహశీల్దార్‌ ఆఫీస్‌కు దూరంగా గ్రామాల విఆర్‌ఎలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వయస్సు పైబడిన వారు, నామినీలుగా పని చేస్తున్న వారు ఫేస్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ ఇవ్వడం సాధ్యంకాదన్నారు. గతంలో 2018లో కూడా ప్రభుత్వం విఆర్‌ఎలకు బయోమెట్రిక్‌ వెయ్యాలనే నిబంధన తీసుకువచ్చినప్పుడు కూడా ఆచరణలో సాధ్యం కాదని యూనియన్‌ విజ్ఞప్తి మేరకు మినహాయింపు చేశారన్నారు. కావున ఫేస్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ వెయ్యటం వలన కలిగే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విఆర్‌ఎలకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎలకు వేతనం రూ.26,000లకు పెంచాలని, లేదా పే స్కేల్‌ ఇవ్వాలని, డిఎతో కూడిన వేతనం ఇవాలని, రికవరీ జిఓను ఉపసంహరించాలన్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతల మోహన్‌ రావు సంఘీభావం తెలుపుతూ విఆర్‌ఏల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విఆర్‌ఏలు చేసే పోరాటాలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
నిరసనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు
విఆర్‌ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పిడిఎఫ్‌ బలపరుస్తున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతున్న నాగరాజు డిమాండ్‌ చేశారు. విఆర్‌ఎల ఆందోళనకు ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాలుగా విడగొట్టి సమస్యలను సృష్టిస్తుందన్నారు. విఆర్‌ఎలను తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు, విద్యార్హతను సర్వీసును బట్టి పదోన్నతులు కల్పించాలన్నారు. ఫేసియల్‌ యాప్‌ను రద్దు చేయాలన్నారు.