Jun 21,2023 00:58
మాట్లాడుతున్న విఆర్‌ఎల సంఘం రాష్ట్ర నాయకుడు కర్నూలు అంజిబాబు

ప్రజాశక్తి-బాపట్ల: వైసిపి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళవుతున్నా వీఆర్‌ఏల సమస్యలు ఒకటి కూడా పరిష్కారానికి నోచుకోలేదని వీఆర్‌ఎల సంఘం రాష్ట్రనాయకులు కర్నూలు అంజిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం బాపట్ల ఎన్జీఓ హౌంలో జరిగిన వీఆర్‌ఏల జిల్లా మహాసభల ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభకు జిల్లా వీఆర్‌ఏల సంఘం కన్వీనర్‌ గోపయ్య అధ్యక్షతవహించారు. అంజి మాట్లాడుతూ ఉన్న జీవోలోనే కోత పెడుతూ వీఆర్‌ఏల నుంచి ఒక్క విఆర్‌ఏతో రూ.19 వేల 5 వందలు రికవరీ చేసుకోవడంతోపాటు జీతాలు పెంచకపోవడంతో వీఆర్‌ఏలు అప్పుల పాలయ్యారన్నారు. నామినీ వీఆర్‌ఏగా ఎన్నో యేళ్ళ నుండి పనిచేస్తున్నవారిని రెగ్యులర్‌ చేయకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయక అర్హులైన వీఆర్‌ఏలకు పదోన్నతి కల్పించకపోవడంతో విఆర్‌ఏలు అయోమయ స్థితిలో ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వారంలోపే గ్రామ సేవకులకు పే స్కేలు, నామినీలను రెగ్యులర్‌ చేస్తాను, ప్రమోషన్లు కల్పిస్తామని, వారసత్వం కొనసాగిస్తామని నాడు జగన్‌ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేర లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కంటే మిన్నగా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తక్షణమే వీఆర్‌ఏలకు న్యాయం చేయాలని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటానికి సిద్దమమౌతామని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. సభలో వీఆర్‌ఏల రాష్ట్ర నాయకులు బందిగీ, బాజీబాబు, సీఐటీయూ బాపట్ల జిల్లా కార్యదర్శి మంజుదార్‌ ప్రసంగించారు.