ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్. వెంకటేష్ హెచ్చరించారు. వీఆర్‌ఏల సమస్యలపై రెండవ రోజు మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు, విఆర్‌ఎలు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అర్ధనగంగా ఒంటి కాలిపై నిలబడి జగనన్నకు దండాలు పెడుతూ నిరసనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇఎస్ వెంకటేష్ మాట్లాడుతూ విఆర్‌ఎలకు వేతనం ఒక్క రూపాయి కూడా పెంచకపోగా వున్న డిఎకు కూడా కోత విధించింది. డిఎ రికవరీ ఆపాలని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏ మాత్రం కనికరించలేదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విఆర్‌ఎ సమస్యలను పరిష్కరించాలని అనేక సార్లు అధికారులకు ప్రభుత్వ పెద్దలకు విన్నవించినా పట్టించుకోకపోలేదని వాపోయారు. ఇప్పటికైనా విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందింకపోతే ఈనెల 25న జగనన్నకు నేరుగా చెబుదాం అనే నినాదంతో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి ప్రసాద్, నాయకులు పెద్దన్న, నరసింహులు, నరసప్ప. పద్మావతి, లక్ష్మీదేవి, సంధ్య నారాయణమ్మతో పాటు విఆర్‌ఎల సంఘం నాయకులు, విఆర్‌ఎలు తదితరులు పాల్గొన్నారు.










