Aug 31,2023 00:30

నరసరావుపేట కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలుపుతున్న విఆర్‌ఎలు

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : విఆర్‌ఎల పట్ల ప్రభుత్వ నిర్బధ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం విఆర్‌ఎలు గుంటూరు, పల్నాడు కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపారు. అనంతర గుంటూరులో కలెక్టరేట్‌ ఏవోకు, నరసరావుపేటలో జెసి ఎ.శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రాలిచ్చారు. విఆర్‌ఎల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బి.లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌.నాగూల్‌మీరా, పల్నాడు జిల్లా అధ్యక్షులు బందగీసాహెబ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న విజయవాడలో విఆర్‌ఎల ధర్నాకు తొలుత అనుమతిచ్చి, విఆర్‌ఎలు విజయవాడ చేరుకున్నాక, అనుమతి రద్దు చేయటం దుర్మార్గమన్నారు. రాష్ట్రప్రభుత్వం విఆర్‌ఎలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, గత ప్రభుత్వం ఇచ్చిన డిఎను కూడా రద్దు చేసి, విఆర్‌ఎను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం నోటికి వచ్చిన వాగ్దానాలన్నీ చేసి, తర్వాత నాలుక కరుచుకోవటం పాలకులకు అలవాటైందని విమర్శించారు. సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించటానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అధికారాన్ని ఉపయోగించి, ప్రజల్ని నిర్బంధించాలని చూసిన అనేక ప్రభుత్వాలకు గతంలో బుద్ది చెప్పారని గుర్తు చేశారు. వీఆర్‌ఏలను అర్ధరాత్రి అరెస్టులు చేయడం, బస్టాండు, రైల్వే స్టేషన్‌, విజయవాడ అలంకార్‌ సెంటర్‌ వద్ద విఆర్‌ఏలను పెద్ద ఎత్తున అరెస్టులు చేయడం దారుణమన్నారు. వీఆర్‌ఏలకు పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, నామీనీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా గుర్తించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వీఆర్‌ఏలకు వర్తింపజేయాలన్నారు. కార్యక్రమాల్లో సురేష్‌, జమీర్‌, సాంబయ్య, సిద్ధయ్య, సుబ్బారావు, కె.రోశయ్య, ఆనంద్‌, నాగేశ్వరరావు, షేక్‌ కాసులు, షేక్‌ ముస్తఫా, విఆర్‌ఎలు పాల్గొన్నారు.