ప్రజాశక్తి-పాడేరు: తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏజెన్సీలోని పలు మండలాల గ్రామ రెవెన్యూ సహాయకులు( వీఆర్‌ఏ)లు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాడేరు తహసిల్దార్ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందర్‌రావు, వీఆర్‌ఏల సంఘం అల్లూరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు బత్తిరి కొండబాబు, సిహెచ్. శేఖర్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలో రాక ముందు పాదయాత్రలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, కంటిన్ జెన్స్ కార్మికులందరికీ రెగ్యులర్ చేస్తామని, కనీస వేతన అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయకపోగా కనీసం వేతనాలు కూడా పెంచకపోవడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో అనేకమంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్‌ఏలుగా అనేకమంది ఏళ్ల తరబడి పని చేస్తున్నప్పటికీ, నేటికి రెగ్యులర్ చేయకపోగా, కనీస వేతనాలు కూడా లేకుండా పని చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న ధరల కనుగుణంగా జీతాలు సరి పోలేదన్నారు. సంక్షేమ పథకాలకు కోతలు పెడుతుండటంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నామిని వీఆర్‌ఏలకు ఉద్యోగం కల్పించాలని, అర్హులైన వీఆర్‌ఏలకు వీఆర్వో, ఓఎస్ వాచ్మెన్లు, డ్రైవర్లుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. డిఏ రికవరి ఆపాలని, వీఆర్‌ఏలను నాలుగో తరగతి ఉద్యోగ గుర్తించాలన్నారు. వీఆర్‌ఏలకు ఫేస్ యాప్ హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంప చోడవరం డివిజన్ అధ్యక్షులు రామకృష్ణ, దేవిక,.అప్పారావు పాల్గొన్నారు.










