
శేఖరం మాడుగులలో పని ముగించుకుని, తిరిగి సందు చివర పార్క్ చేసిన తన స్కూటరు దగ్గరకి వచ్చాడు. అయితే పక్కనే హల్వా దుకాణం కనబడుతోంది. నేతి వాసనతో నాసికాన్ని అదరగొట్టిన ఆ హల్వా దుకాణం, తనని రమ్మనీ ఓ ముక్క హల్వా తినమనీ ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించింది. ఆ మహత్తరమైన వాసనకే తినాలనే ఆత్రం పెరిగిపోతోంది అతనిలో. ఆ మిఠాయి దుకాణం పేరు 'మాడుగుల హల్వా' అని రాసి ఉంది. అది చదివిన శేఖరం, అరే చిత్రంగా ఉందే. చిన్నప్పుడు మా ఊళ్లో కూడా ఈ పేరుతో ఓ హల్వా కొట్టు ఉండేది. అయితే అది ఉత్తుత్తి హల్వానే కానీ, పాడు వెధవ మాడుగుల హల్వా పేరుతో అమ్మేవాడని అంతా అనుకునేవారు. ఆ హల్వా దుకాణానికి నేను చదివే కాన్వెంటుకీ ఓ పది అడుగుల మాత్రమే దూరం. నేను ఎప్పుడూ మధ్యాహ్నం లంచ్ బ్రేకులో నా బాక్స్ తినేశాక, ఆ కొట్టుకి వెళ్లి నా దగ్గరున్న చిల్లరతో చిన్న హల్వా ముక్క కొనుక్కుని తినేవాడ్ని. అయితే ఒక్కోసారి ఎక్కువమంది కష్టమర్లు ఉన్నప్పుడు మాత్రం అతను 'లేదు చిల్లరకి హల్వా అమ్మట్లేదు!' అనేసేవాడు. అప్పుడు అతని చేయి కొరకాలన్నంత కోపం వచ్చినా, నా పని గట్టెక్కేందుకుగాను వాడ్ని కొంచెం కాకా పట్టక తప్పేదికాదు. లేదా నా స్నేహితుల దగ్గర అప్పు చేసో, లేక వారి హోంవర్కు నేను రాసో మొత్తానికి ఎలాగోలా కొనుక్కు తినేవాడ్ని. మా నాన్న నన్ను పొరబాట్న కూడా ఆ దుకాణం మీదుగా తీసుకెళ్లేవాడు కాదు. తీసుకువెళితే తప్పక కనీసం ఓ అరకేజీ హల్వా అయినా కొనమని ప్రాణం తీసేసేవాడిని. అలాగే నా పుట్టినరోజు వచ్చినా, మార్కులు ఎక్కువ వచ్చినా హల్వా కావాలని అల్లరి చేసేవాడిని. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే, 'రా మావయ్యా!' అని వారిని బయటికి తీసుకెళ్లి, అటూ తిప్పి ఇటూ తిప్పి చివరికి ఆ హల్వా దుకాణానికే తీసుకుపోయి కొనమనిన పేచీ పెట్టేవాడిని. దాంతో వారు సరే అని ఓ నవ్వు నవ్వేసి కొనిపెట్టేవారు. అలా కొనిపించుకున్న హల్వా మా చెల్లి వల్లి ఎంత బతిమాలి అడిగినా కూడా పెట్టకుండా, గుట్టుగా ఓ బుట్టలో దాచుకుని తినేవాడ్ని.. అంతా గుర్తుచేసుకుని, నాకు అంత ఇష్టమైన హల్వా, అదీ ఈ మాడుగులలో కనబడితే ఎలా వదలి ముందుకు కదలగలను? తప్పక తినే వెళ్తాను. ఓ పావుకేజీ ఇప్పుడే కొనేసి, ఇక్కడే తినేసి, ఓ అరకేజీ ఇంటికి పట్టుకెళ్లిపోతే పోలా. ఈ మాత్రం దానికి ఇంత ఆలోచించి, ఇంతలా లొట్టలేయాలా? ఏమిటి? అనుకుంటూ జేబులో చేయిపెట్టాడు శేఖరం. ఇక్కడ పర్సు అనే పదార్థం ఉండాలే అనుకుని మళ్లీ తడిమాడు. కానీ ఏం తగల్లేదు. అటు జేబూ, వెనుక జేబూ కూడా చూశాడు. ఏం లాభం లేదు. పర్సు ఎక్కడో పడిపోయుంటుంది. డబ్బులూ, కార్డులూ అన్నీ అందులోనే ఉండిపోయాయి. పైగా నా సెల్‌ఫోను కూడా మర్చిపోయి వచ్చానే. ఫోనున్నా పోను. కనీసం ఏ పేటీయమ్మో చేసేసేవాడ్ని. ఛ అనుకుంటూ నిరాశగా పై జేబు తడిమాడు. ఓ క్షణం హల్వా తినొచ్చు అనే ఆశ మళ్లీ అతనిలో చిగురించింది. కారణం ఏదో నోటు తగిలింది చేతికి. వెంటనే ఆ నోటు బయటికి తీసి చూశాడు. బుస్సున పొంగిన ఆనందం అంతా ఒక్క క్షణంలోనే తుస్సున ఆవిరైపోయింది. అది ఇరవై రూపాయలు. రెండు పదులు చేతిలో పెట్టి, రెండు హల్వా ముక్కలు పెట్టమంటే మరీ అసహ్యంగా ఉంటుందేమో. పైగా 'పావుకేజీ నేతి హల్వా నూటయాభై రూపాయలు!' అని బోర్డు వేలాడుతోంది. కొద్దిసేపు ఆలోచించి, ఓ పనిచేద్దాం, ముందు దుకాణంలో ఉన్న అతన్ని పరిచయం చేసుకుని, తర్వాత కొంచెం కాకాపట్టి, ఆ తర్వాత నా పరిస్థితి చెప్పి చిన్న ముక్క ఇమ్మంటాను, తప్పక ఇస్తాడు. దాంతో జిహ్వ వహ్వా అనీ శాంతిస్తాయి.. అలా నిర్ణయించుకుని, ఆ మిఠాయి దుకాణంలోకి వెళ్లాడు. వెళ్లి, అతన్ని కొంచెం పరిశీలనగా చూస్తున్నట్టు చూసి, చిన్న చిరునవ్వుతో, 'మిమ్మల్ని మునుపు ఎక్కడో చూసినట్టుగా ఉందండీ!' అడిగాడు శేఖరం.
'అవునా, అయితే అయి ఉండొచ్చునండీ. నేను డ్రామాలూ అవీ వేస్తుంటాను. బహుశా అందులో ఎప్పుడైనా ఎక్కడైనా చూసి ఉండవచ్చు!' చెప్పాడాయన.
హమ్మయ్య వెతకబోయిన తీగని వీడే కాలికి తగిలించాడు. ఇక ఇదే అదనుగా దూసుకుపోవాలి అని మనసులో అనుకుని, 'అలాగా, నేను మీ మీసం చూసినప్పుడే అనుకున్నాను మీరు నవరస నటుడని. మీ ముఖంలో గట్టిగా ఉట్టిపడుతున్న ఆ కళా కాంతే చెబుతున్నాయి మీరు కళాకారులని. అంతెందుకు, భావాలన్నీ మీ కళ్లలోనే సుళ్లు తిరుగుతున్నాయంటే నమ్మండి!' చెప్పాడు శేఖరం.
'చాలా సంతోషంగా ఉందండీ! మీరు నా గురించి ఇలా పొగిడాక. మీ పేరు?' అడిగాడు.
'నా పేరు శేఖరం. నేను ఉండేది బెంగళూరులో. పక్క ఊళ్లో ఉంటున్న దూరపు చుట్టాల ఇంటికి వచ్చాను. అలాగే ఈ ఊళ్లో ఉన్న ఒకాయన నాకెంతో సాయం చేశారు. అందుకే వారిని మర్యాద పూర్వకంగా కలిసి పోదామని ఇలా మాడుగుల వచ్చాను. ఇలా వెళుతూ, వెళుతూ మిమ్మల్ని చూశాను. సరే ఓసారి పలకరిస్తే బావుండనిపించి, ఇలా వచ్చాను. మరో విషయం ఏమిటంటే నాకు చిన్నప్పటి నుండీ హల్వా అంటే ప్రాణం. కానీ ఇప్పుడు..' అని ఏదో చెప్పేంతలో, కిర్రు చెప్పులతో, తెల్ల చొక్కా వేసుకున్న ఒకతను, చర చరా దుకాణంలోకి నడిచి వస్తూ, 'ఒరేరు శరభయ్యా! బేరాలు ఎలా ఉన్నాయి ఇవాళ? హల్వా ఏమాత్రం అమ్ముడయింది?' అడిగుతూనే వచ్చాడతను.
'పొద్దున్న నుండీ అయితే, హల్వా పావు, అరా అంతా కలిసి ఓ తొమ్మిది కిలోలు అమ్ముడు కాగా, ఇందాకే ఒకరు వచ్చి పన్నెండు కేజీలు కొనుక్కెళ్లారు బావా. అంతా కలిపి ఇరవై ఒక్క కేజీ అమ్ముడయింది బావా!' చెప్పాడు ఉత్సాహంగా.
'అవునా, మంచిమాట చెప్పావురా. హల్వా తిన్నంత హాయిగా ఉంది. అలానే ఎవరికీ చిన్నా చితకా బేరానికి హల్వా అమ్మలేదుగా? ఎందుకంటే అలా అమ్ముతున్నానని నువ్వు ఎన్ని కాకి లెక్కలు చెప్తున్నా, తయారుచేసిన హల్వాకి, నువ్వు అమ్ముతున్న మొత్తానికి తెగ తేడా వచ్చేస్తోంది. ఎట్నుంచి ఎటు చూసినా కూడిక పూడిక తీయలేక ఛస్తున్నాను. మందలించినా పందిలా దులుపుకుపోతున్నావే కానీ, దుంపంత ఆలోచన కూడా చేయడం లేదు. అందుకే ఇలా కనీసం పావుకిలో తక్కువ అమ్మొద్దని చెప్పింది. దాంతోనైనా నీ చేతివాటం తగ్గుతుందనీ. లెక్క నిక్కచ్చిగా తెలుస్తుందనీనూ!' చెప్పాడతను అసహనంగా.
'లేదు బావా అలాంటి పావులో సగం లాంటి బేరాలాడే వాళ్లకి అమ్మడం మానేశాను. నువ్వు అనుకుంటున్నట్టు నేనేం చిల్లరగా అమ్మానని చెప్పి, డబ్బులు మిగుల్చుకోవడం లేదు బావా! అంతా నీ భ్రమ!' అని అన్నాడు.
'సర్లే నువ్విక వెళ్లు. దుకాణం నేను చూసుకుంటాన్లే. నువ్వు సాయంత్రం నాలుగ్గంటలకి అలా రా!' చెప్పాడా వచ్చిన వ్యక్తి.
అప్పటివరకూ, ఆ దుకాణంలో ఉన్నతన్ని కాకా పట్టి, ఇరవై రూపాయిలకి హల్వా అడుగుదామని అనుకున్నవాడల్లా ఆ వ్యక్తి మాటలు విని అవాక్కైపోయి వాక్కు రాలేదు. కొద్దిసేపు ఆవ బద్దలా చలనం లేకుండా ఉండిపోయాడు. తర్వాత తేరుకుని, 'ఎంతో ఆశపడి, అంత ఆలోచన చేసినా ఇలా జరిగిందేమిటీ? పోన్లే ప్రాప్తం లేదు' అని మనసులో అనుకుని, 'సరే వస్తాను శరభయ్యగారూ! ఈ సారి మీ డ్రామా అయినపుడు వస్తానులెండి!' అని చెప్పి వెనుదిరిగాడు శేఖరం.. ఆ హల్వా వంక మరోసారి ఆశగా చూస్తూ.
'ఎవర్రా శరభయ్యా?' అతను అడిగాడు.
'అతను నా డ్రామాలూ అవీ చూశాడట. ఓ రకంగా నాకు ఇప్పుడే స్నేహితుడయ్యాడు బావా!'
'అలాగా!' అని ఓ క్షణం ఆగి, 'సార్ ఓ సారి ఇటురండి సార్!' పిలిచాడాయన. శేఖరం వచ్చాక, 'ఏంట్రా శరభయ్యా నువ్వు. నీ కోసం ఇంత ఆత్మీయంగా వచ్చి నిన్ను పలకరిస్తే, ఆయన్ని ఖాళీ చేతులతో పంపుతావా? పైగా నీకు స్నేహితులు కూడా అయ్యారన్నావుగా. నీకు బొత్తిగా మర్యాదా మన్ననా లేకుండాపోతోంది పోతు మొహవా! పో, పోయి ఓ చిన్నపొట్లం హల్వా కట్టివ్వు సార్‌కి!' చెప్పాడతను.
ఆ మాటలు వింటూనే శేఖరం మనసు ఎంతో పొంగిపోయింది. ఆ పొట్లాన్ని ఎంతో సంతోషంతో అపురూపంగా అందుకుని, హాయిగా నవ్వాడు శేఖరం.
గంగాధర్ వడ్లమన్నాటి
99084 45969