
ప్రజాశక్తి -గోపాలపట్నం : దాదాసాహెబ్‌ఫాల్కే జీవితసాఫల్య పురస్కారం అందుకున్న ప్రముఖ చలనచిత్ర నటి వహీదా రెహమాన్‌కు గోపాలపట్నం సేవా కళాపీఠం అభినందనలు తెలిపింది. గురువారం 92వ వార్డు గోపాలపట్నంలో కళాపీఠం అధ్యక్షులు గోరకల రామదాసు అధ్యక్షతన జరిగిన సభలో వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరపు సోములు మాట్లాడుతూ, దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి,అందం కంటే అభినయంతో నాటితరం ప్రేక్షకుల్లో గుర్తింపు పొందిన నటీమణి వహీదాకు, విశాఖతో అనుబంధం ఉందన్నారు. కొంతకాలం నగరంలోనే ఉన్నారన్నారు. మాజీ అధ్యక్షులు చందు సుబ్బారావు మాట్లాడుతూ తెలుగులో మొదటి శతదినోత్సవం చిత్రం జయసింహలో ఎన్‌టిఆర్ సరసన హీరోయిన్‌గా నటించిన వహీదా, తర్వాత రోజులు మారాయి చిత్రంలో ఏరువాక సాగారో పాటలో అభినయంతో ఆమె పేరు మారుమోగిపోయిందన్నారు. కత్తి కాంతారావు హీరోగా 'కన్యాదానం' చిత్రంలో రెండు పాటల్లో నటించినా అదిప్లాఫ్ అయింది. తమిళంలో రెండు చిత్రాల్లో నటించిన వహీదా, హైదరాబాదీ నటుడు, దర్శకనిర్మాత గురుదత్త దృష్టిలో పడడం, బాలీవుడ్ ఆఫర్లు రావడం,వ్యాసా చిత్రంలో వేశ్యపాత్రతో వచ్చిన గుర్తింపుతో కెరీర్‌కు తిరుగులేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్న వహీదా ఎనిమిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు, 2006లో ఎన్‌టిఆర్ పురస్కారం అందుకుందన్నారు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో నటిగా ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిందని కొనియాడారు. కార్యక్రమంలో సేవా పీఠం ఉపాధ్యక్షులు గంపల అప్పారావు, ప్రధాన కార్యదర్శి డి సింహాచలం నాయుడు, కోశాధికారి భాస్కర్ పాణిగ్రహి, ఎల్లపు రమణ, ఎ.నారాయణరావు, ధన్పాల్ గజేంద్ర, గోరపల్లి బంగార్రాజు, రామచంద్రరావు, బండారు శ్రీనివాస్, మిద్దె అప్పారావు , తాండ్రంగి రామారావు పాల్గొన్నారు.