ప్రజాశక్తి - ఎమ్మిగనూరు రూరల్
వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల్లో క్లస్టర్ విధానాన్ని ఎత్తేయాలని ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు సురేష్ యాదవ్, నాయకులు రంగస్వామి, హరి, వీరేష్, శివరాం, భాస్కర్, సోమిరెడ్డి కోరారు. బుధవారం ఎంపిడిఒ బంగారమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో, సచివాలయ పరిధిలో ఖాళీగా ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. 3 నుంచి 5 రైతు భరోసా కేంద్రాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల్లో పోస్టులను మిగులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి డెయిరీ ఒకేషనల్, డిప్లొమా చదివిన అభ్యర్థులు సుమారు 30 వేల మందికిపైగా నష్టపోతున్నారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలతో క్లస్టర్ విధానం మీద ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దు చేసి ఖాళీగా ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపిడిఒ బంగారమ్మకు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










