Feb 16,2023 00:12

విద్యార్థులను ప్రశ్నిస్తున్న బృందం సభ్యులు

ప్రజాశక్తి-నక్కపల్లి:విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యం మెరుగు పరచాలని రాష్ట్ర పర్యవేక్షణ బృందం ఉపాధ్యాయులకు సూచించింది. నక్కపల్లి బాలికోన్నత పాఠశాలను బుధవారం రాష్ట్ర పర్యవేక్షణ బృందం సభ్యులు జిజిఎస్‌ నాగేశ్వరరావు, వీవీఎస్‌ నాగలక్ష్మి, డేవిడ్‌ రాజు, నోడల్‌ అధికారి గిరి సందర్శించి, విద్యార్థుల్లో అభ్యాసనా మెరుగును పరిశీలించారు. 6, 7, 8 తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయుల లెసన్‌ ప్లాన్లు, డైరీలు, విద్యార్థుల నోటు పుస్తకాలు, నెలవారి ప్రగతి, విద్యార్థులు పొందిన గ్రేడ్లు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.అదనపు తరగతులు నిర్వహించి అభ్యసనా స్థాయిని మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థుల స్థాయిని బట్టి ఉపాధ్యాయుల బోధన ఉండాలన్నారు. టీచింగ్‌ పీరియడ్‌తో పాటు ప్రాక్టీస్‌ పిరియడ్‌ ద్వారా విద్యార్థుల్లో అభ్యాసనా సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు .ఉపాధ్యాయులు ఎల్‌ఐపి శిక్షణ కార్యక్రమంలో సూచించిన విధంగా పాఠ్యప్రణాళికను సిద్ధ పరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్‌, హెచ్‌ఎం పుష్యరాగం పాల్గొన్నారు.