ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి లక్ష కోట్లు నిధులను కేంద్రం కేటాయించాలని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. అనంతపురం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నగరంలోని రేడియెంట్ ఫంక్షన్ హాలులో 'జిల్లా సమగ్రాభివృద్ధి-ప్రత్యామ్నాయ విధానాలు' అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. 'వ్యవసాయం-నీటిపారుదల, పరిశ్రమలు-ఉపాధి, సామాజిక తరగతులు- అభివృద్ధి ఆటంకాలు, విద్యా-వైద్యం నాలుగు అంశాలపై సదస్సు జరిగింది. ఒక్కో అంశానికి సంబంధించి ఆయా రంగంల్లో అనుభవమున్న వారు ప్రసంగించారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమెల్సీ డాక్టర్ గేయానంద్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు ప్రారంభోపన్యాసం చేశారు. ప్రభుత్వాలు అభివృద్ధి అన్న దానికే అర్థాలు మార్చేస్తున్నాయని చెప్పారు. తలసరి ఆదాయన్ని చూపించి అదే అభివృద్ధి అని చెబుతున్నాయన్నారు. ఆ రకమైన ఆర్థికాభివృద్ధి చూసినప్పుడు అది ధనవంతులు, పెట్టుబడిదారుల అభివృద్ధిగానే ఉంటోందన్నారు. ఆర్థికాభివృద్ధితోపాటు, మానవాభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో భారతదేశంలో ముందుకుపోతున్నా మానవాభివృద్ధిలో ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉందని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక 77వ స్థానంలో ఉండగా భారతదేశంలో 133వ స్థానంలో ఉందని చెప్పారు. విద్యా, వైద్యం, ఆరోగ్యం, తదితర అంశాలన్నీ మానవాభివృద్ధి సూచికలోకి వస్తాయన్నారు. సమాజంలోని అన్ని తరగతుల అభివృద్ధి సాధించినప్పుడే నిజమైన అభివృద్ధి అవుతుందని వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాభివృద్ధి మరింత కుంటుపడిందని విచారం వ్యక్తం చేశారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుంధేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నది కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీనివ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి రంగంపై మావన హక్కుల వేదిక నాయకులు ఎస్‌ఎం.బాషా మాట్లాడుతూ అత్యల్ప వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాకు సాగు,తాగునీటి వనరులను తీసుకురావడంతో పాలకులు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలోనున్న సమయంలో ప్రతి పార్టీ కూడా జిల్లాలో ప్రతి ఎకరానికీ నీటిని అందిస్తామని హామీలిచ్చి మోసం చేస్తున్నాయన్నారు. ఈ విషయంపై ఆయా పార్టీలను, నాయకులను నిలదీయాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. ప్రశ్నించనప్పుడే జిల్లాకు సాగునీటి వనరులను రాబట్టుకోగలమని చెప్పారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, హంద్రీనీవా ప్రాజెక్టుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల నీటిని సక్రమంగా వినియోగించుకునే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ వ్యవసాయంలో వస్తున్న మార్పులను ఈ సందర్భంగా విశ్లేషించారు. జిల్లాలో పంటల సరళీలో అనేకమైన మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. మొదట ఆహార పంటలు అధికంగా ఉంటే 1990 దశకం నుంచి వేరుశనగ పంట ప్రధాన పంటగా జిల్లాలో మారిందన్నారు. ఇప్పుడు అది పోయి పండ్లతోటల సాగు గణనీయంగా పెరుగుతోందని వివరించారు. మారుతున్న పంటల సరళీకి అనుగుణంగా తగిన ప్రోత్సహకాలను ప్రభుత్వాల వైపు నుంచి ఉండటం లేదని తెలిపారు. పండ్లతోటల సాగుకు అవసరమైన ప్రోత్సహకాలను ప్రభుత్వాలు నిలిపివేసాయన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ రంగానికి రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహకం సహకారం అందించే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు- ఉపాధి అంశంపై ప్రొఫెసర్ బావయ్య మాట్లాడుతూ కోవిడ్ సమయంలో చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు పెద్దఎత్తున దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. వీటిని తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక పథకాలను ప్రభుత్వ స్థాయిలో తీసుకురావడం జరుగుతోందన్నారు. వీటి పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు. వీటి పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడంతో ముందుకు రావడం లేదని అన్నారు. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు అన్న అంశంపై అసిస్టెంట్ ప్రొఫెసరు క్యాస్ట్రో కిరణ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఐటి రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దీన్ని అందిపుచ్చుకోవడానికి ఇతర రంగాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన వారు కూడా ఐటి రంగంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పూర్తి స్థాయి సాంకేతిక అందిపుచ్చుకోకుండా అడుగు పెట్టడం ద్వారా కొన్ని ఇబ్బందులూ ఎదుర్కొనే పరిస్థితులుంటున్నాయి. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో విద్యాలయాల్లోనూ క్వాలిఫైడ్ అధ్యాకుల్లేకుండా కోర్సులను పూర్తి చేయిస్తున్నారు. ఇది కూడా ఐటి రంగంలోకి అడుగుపెట్టే వారికి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సామాజిక తరగతులు-అభివృద్ధి-ఆటంకాలు అన్న అంశంపై ప్రజా పర్యవేక్షణ కమిటీ కన్వీనర్ సత్యబోస్, భానుజాలు మాట్లాడారు. వైద్యరంగంపై డాక్టర్ ప్రసూన మాట్లాడారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.










