Jun 07,2023 19:47

గ్రామైక్య సంఘం మహిళలతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి - గోనెగండ్ల
ఆదోని డెవలప్‌మెంట్‌ అథారిటీ కింద గోనెగండ్ల మండలంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం ఆయన గోనెగండ్లలో పర్యటించారు. మండల అధికారులతో కలిసి ఎన్నో సంవత్సరాలుగా నిర్మాణం పూర్తి చేసుకుని కొంత అసంపూర్తిగా మిగిలిపోయిన స్త్రీ శక్తి భవనాన్ని ఆయన పరిశీలించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేసి భవనాన్ని ఇచ్చేందుకు అవసరమైన రూ.6 లక్షల నిధులను మంజూరు చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసుకోనున్న మహిళా మార్ట్‌కు అవసరమైన భవనం కోసం వ్యవసాయ సహకార సంఘం గోడౌన్‌ను పరిశీలించారు. గోడౌన్‌కు కొన్ని మరమ్మతులు చేసుకుని మహిళా మార్ట్‌ను ప్రారంభించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామైక్య సంఘాల మహిళలతో మాట్లాడే పలు విషయాలపై అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందేందుకు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలి, ఏ రకమైన యూనిట్లను ఏర్పాటు చేయాలనే అంశాలపై చర్చించి విచారించారు. తహశీల్దార్‌ వేణుగోపాల్‌, ఎంపిడిఒ నాగేష్‌, వెలుగు సిసిలు లలిత రాణి, శకుంతల, వీర కృష్ణుడు, ముక్కన్న పాల్గొన్నారు.