Feb 20,2023 22:05

'విజయ కేతనం' పుస్తకావిష్కరణలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌
ప్రజాశక్తి - ఏలూరు

             జిల్లాలో 2022-23 సంవత్సరానికి వెనుకబడిన పదో తరగతి విద్యార్థులకు 40 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ తెలిపారు. దీనికి సంబంధించిన 'విజయ కేతనం' పుస్తకాన్ని ఆయన సోమవారం తన ఛాంబర్‌లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఒ ఎన్‌వి.రవిసాగర్‌ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతిలో వెనుకబడిన విద్యార్థుల కోసం రూపొందించిన 40 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక 'విజయ కేతనం' పుస్తకాన్ని విద్యాశాఖ పరంగా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. కోవిడ్‌ వల్ల పదో తరగతిలో పరీక్షా ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్నాయని తెలిపారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ కాలంలో అవకాశం లేకుండా పోయిందని, దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించాలనే సదుద్ధేశంతో అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యాలతో కూడిన ఉపాధ్యాయులచే 'విజయ కేతనం' పుస్తకాన్ని రూపొందించి కలెక్టర్‌ చేతుల మీదుగా విడుదల చేశామని తెలిపారు. ఈ 40 రోజుల ప్రణాళిక ప్రకారం విద్యార్థులు శ్రద్ధగా చదివి పదో తరగతిలో విజయకేతనం సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంఇఒ ఎస్‌.నరసింహమూర్తి, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ ఏలూరు అర్బన్‌ డి.సాంబశివరావు, డిసిఇబి సెక్రటరీ అంగుళూరి సర్వేశ్వరరావు, ఉపాధ్యాయుడు జిజిఎ.స్టీవెన్‌ తదితరులు పాల్గొన్నారు.
తనిఖీ నివేదికపై కలెక్టర్‌ సమీక్ష
జిల్లాస్ధాయిలో వివిధ జిల్లా శాఖల అధికారులు నిర్వహిస్తున్న తనిఖీ నివేదికపై సోమవారం గౌతమి సమావేశ మందిరంలో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ సమీక్షించారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పాఠశాలలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందిస్తున్న ఆహార నాణ్యత, కోడిగుడ్లు పంపిణీ, పిల్లల బరువు, ఎత్తు, ప్రదర్శించే ఛార్టుల ఏర్పాటు, పారిశుధ్యం, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారంపై, సర్వే ప్రకారం రక్తహీనతపైన, వారానికి ఒక రోజు ఆకుకూరల్లో మునగాకు ఉపయోగించాలని, పిల్లలకు నేర్పిస్తున్న విద్యపైన, పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత లోపిస్తే ఏజెన్సీని మార్చాలని, వంటలు చేసే షెడ్లలోనే వంటలు చేయాలని, పాఠశాల పనులకు సంబంధించిన మెటీరియల్‌ భద్రత ప్రదేశాల్లో ఉంచాలే తప్ప, విద్యార్థులు ఆడుకునే క్రీడా మైదానాల్లో వేయకూడదని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్యం మెరుగుకు, మెడికల్‌ ఆఫీసర్‌ డ్యూటీ సమయంలో అందుబాటులో ఉంటున్నారా, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటున్నాయా తనిఖీ చేసి నివేదికను సంబంధిత జిల్లా అధికారులకు పంపాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, డిపిఒ మల్లికార్జునరావు, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ నాగేశ్వరరావు, సోషల్‌ వెల్పేర్‌ జెడి మధుసూదనరావు, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.