జిల్లా ప్రజాతంత్ర ఉద్యమంలో కీలక కార్యకర్తగా వున్న కామ్రేడ్ చిట్టిపోతుల హరిబాబు మరణించడం తీరని లోటు. ప్రకాశం జిల్లా ఉప్పమాగులూరు గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించిన ఆయన... పియుసి పూర్తి చేసిన అనంతరం ఆంధ్రా యూనివర్శిటీలో బైండింగ్ సెక్షన్‌లో చిరు ఉద్యోగిగా చేరారు. ఉద్యోగం చేస్తూనే డిగ్రీ, పి.జి పూర్తి చేశారు. 1976లో ఆంధ్ర యూనివర్సిటీ పి.జి సెంటర్‌ను నల్లపాడులో ప్రారంభించగా గుంటూరు జిల్లాకు బదిలీ అయి వచ్చారు. ఆంధ్రా యూనివర్శిటీలో వుండగానే కామ్రేడ్ నండూరి ప్రసాదరావు పరిచయంతో హరిబాబు ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఉద్యమంలో ఏనాడూ వెనుకడుగు వేయనేలేదు.
1978లో నాగార్జున యూనివర్శిటీ ఏర్పడ్డాక యూనివర్శిటీ ఉద్యోగిగా చేరి, నాన్ టీచింగ్ స్టాఫ్ యూనియన్ నిర్మించి వారి సమస్యలపై దశల వారీగా ఆందోళన చేపట్టారు. హాస్టల్ వర్కర్స్ యూనియన్ స్థాపించి...కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, తాత్కాలిక ఉద్యోగ ుల సమస్యలపై పోరాడి విజయం సాధించిన ఘనత హరిబాబుది. యూనివర్శిటీలో ఉద్యోగుల గుర్తింపు ఎన్నికల్లో 3 సార్లు గెలవడమే కాక మన సంఘం ప్యానల్‌ను పదేళ్ల పాటు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. యూనివర్శిటీలో కుల శక్తులు, అరాచకవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు నడిపారు.
పాతికేళ్ల కిందట జరిగిన యాక్సిడెంట్‌లో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాక ... క్షణం తీరిక లేకుండా యూనివర్శిటీ ఉద్యమంలోను, గుంటూరు సిపియం నగర కమిటీ సభ్యులుగాను నిరంతరం కృషి చేశారు. యూనివర్శిటీ ఉద్యోగులకు రాజకీయ శిక్షణ కోసం స్టడీసర్కిళ్లు, క్లాసులు జరిపి వారిని చైతన్య పర్చడానికి ప్రాధాన్యత ఇచ్చే వారు. నేను యూనివర్శిటీ విద్యార్థిగా వుండగా ఎస్.ఎఫ్.ఐ కి అండదండలు అందించి కార్యకర్తలకు భరోసా కల్పించే వారు. 2010లో రిటైర్ అయిన తర్వాత కూడా నిరంతరం ప్రజా సంఘాల కార్యక్రమాల లోనే వుండేవారు. యూనివ ర్శిటీ ఉద్యోగుల సమస్యల పైన, సంఘం నిర్మాణం పైనే కేంద్రీకరించి పని చేశారు. గుంటూరు జిల్లా అమర వీరుల చరిత్రను గ్రంథస్తం చేయడంలో కీలకపాత్ర పోషిం చారు. సుమారుగా 650 మంది కమ్యూనిస్టు ఉద్యమ నేతల జీవిత చరిత్రలను జిల్లా మొత్తం తిరిగి సేకరించి అమూల్యమైన గ్రంథాన్ని తీసుకురావడంలో ప్రొ|| ఎమ్.వి.ఎస్. కోటేశ్వరరావుతో కలిసి కృషి చేశారు.
గుంటూరు సుందరయ్య నగర్‌లో ఎమ్.వి.యస్ మెమోరియల్ స్కూలు నిర్మాణం లోను, గత 4 సంవత్సరాలుగా ఆ స్కూలు నిర్వహణ లోను హరిబాబు కీలక పాత్ర పోషించారు. స్కూల్ నడపడమే కాదు, స్కూలు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రధానంగా సుందరయ్య నగర్‌లో పార్టీ, ప్రజా సంఘాల అభివృద్ధికి పరితపించ ేవారు. అందుకు తగిన కార్యాచరణను నాయకుల ముందుంచ ేవారు. హరిబాబు ఉద్యమంలో పని చేయడానికిగాను ఆయన సహచరిణి కామ్రేడ్ ప్రమీల నిరంతరం సహకరించారు. కుటుంబం యావత్తు ప్రజాతంత్ర ఉద్యమానికి అండదండలని చ్చింది.
నెల రోజుల క్రితం కలిసినప్పుడు కూడా...గతంలో అమర వీరుల చరిత్రలో మిస్సయిన 150 మంది పేర్లు, వారి చరిత్రల వివరాలను చేతికిచ్చి వచ్చే జిల్లా మహాసభ నాటికి పుస్తక రూపం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇంతలోనే కరోనా మహమ్మారికి బలికావడం జిల్లా ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు.
- పాశం రామారావు,
సిపియం తూర్పు జిల్లా కార్యదర్శి.










