ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు దఫాలు కురిసిన అకాల వర్షాలు రబీ రైతులను నిండా ముంచెత్తాయి. కష్టాలు, నష్టాల నుంచి ఇంకా తేరకోకముందే మరో అల్పపీడన భయం అన్నదాతలను వెంటాడుతోంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి గట్టెక్కే మార్గాలు లేక అల్లాడుతుంటే భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం అరకొర చర్యలకే పరిమితమవుతోంది. అననుకూల పరిస్థితుల నేపథ్యంలో సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోవడంతో నష్టాలు మరింత పెరుగుతున్నాయి. కొనుగోలులో నిబంధనలు, సంచులు, ట్రాన్స్ పోర్ట్ కొరత, అన్ లోడింగ్ సమస్యలు, మిల్లర్ల కొర్రీలు వెరసి సమస్యలు తప్పడం లేదు. వాటిని సరిదిద్దాల్సిన ప్రభుత్వ యంత్రాంగం ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకొంటోందని క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఏడాది కాకినాడ జిల్లాలో 1.63 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరగ్గా ఇప్పటికే 50 శాతం కోతలు పూర్తయ్యాయి. నాలుగు రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన అకాల వర్షాలకు ప్రధానంగా 140 గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 10 వేల ఎకరాల పైబడి కోయకుండా ఉన్న పంట నేలకు ఒరగడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. పది రోజుల్లోపే ఈ పంట అంతా చేతికి అంది వచ్చే అవకాశం ఉంది. అయితే అకాలంగా కురిసిన వానలు అన్నదాతలను నిండా ముంచెత్తడంతో లబోదిబోమంటున్నారు. ఎకరాకు రూ.35 వేల నుంచి రూ.45 వేల పెట్టుబడులు పెట్టిన వీరంతా పూర్తిస్థాయిలో నష్టపోయారు. రెండు రోజుల్లోనే ఒబ్బిడి చేసుకుని ధాన్యం ఉత్పత్తిని కళ్లారా చూద్దామనుకున్న రైతుల ఆశలు అంతలోనే కరిగిపోయాయి. సుమారు 6 వేల ఎకరాల్లో కోసి పనలపై ఉన్న పంట అంతా తడిచి ముద్దై మొక్కలు వచ్చింది. సుమారు 7 వేల ఎకరాలలో 21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాశులుగా ఉండడంతో తడిసి ముద్దవ్వగా ఇందులో కొంత దాన్యాన్ని తక్కువ ధరకే రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోగా మరికొంత ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసారు. అయితే ఇందులోనూ నూక శాతం సాకు చూపి రైతుల నుంచి సొమ్ములు కట్టించుకోవడం విశేషం.
ఆరబెట్టేందుకు అవకాశం లేక...
వారం రోజులుగా వాతావరణంలో నెలకొన్న మార్పులు కారణంగా అన్నదాతలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పలుచోట్ల నేటికీ ధాన్యం రాశులు ఎక్కడకక్కడే దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవకాశం లేకుండా పోతుంది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో వర్షం పడుతోంది. దాంతో పలుచోట్ల ధాన్యం మొలకలు వచ్చింది. ఆర బెట్టకుండా అమ్ముదామంటే తేమ, నూక శాతం పేరుతో మిల్లర్లు బస్తాకు రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారని రైతులు తెలిపారు.
వర్ష సూచనలతో బెంబేలు
ఈ నెల 7న ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా మారి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతల్లో ఆందోళన మరింత తీవ్రతనం అయ్యింది. శనివారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో పలుచోట్ల మళ్లీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశంలో మబ్బులు అలుముకున్నాయి. కొన్నిచోట్ల మళ్లీ వర్షాలు కురిశాయి. రెండు రోజులపాటు ఎండ రావడంతో తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు ఉపక్రమించారు. అయితే పూర్తిస్థాయిలో తేమశాతం తగ్గకుండానే మళ్లీ వానలు పడుతున్నాయి. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వ యంత్రాంగం మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పలువురు రైతులు వద్దకు ఎవరు కొనుగోలు కోసం వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.










