
రామసముద్రం : మదనపల్లి నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో నిన్నటిదాకా పదిహేను రోజులు కిందట రైతులకు నేనున్నానని పలకరించిన వర్షం ఇప్పుడు ముఖం చాటేసింది. ఇదే సమయంలో కరెంట్ కోతలతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతులు వరి పంటలు పండించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి కాలంలో రావాల్సిన కరెంట్ కష్టాలు రైతులకు ఇప్పుడే వచ్చేసాయి. సరఫరా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. గతంలో వర్షాభావం ఇప్పుడు.. విద్యుత్ కోతలు కారణంగా పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
అప్రకటిత కోతలు.. ఓల్టేజీ సమస్య..
నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో కరెంట్ కోతలతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతలపై విద్యుత్ శాఖ అధికారులను అడిగినా సమాధానం రావడం లేదు. ఇటీవల కరెంట్ కోతలు మరీ దారుణంగా ఉంటున్నాయి. ప్రతి రోజూ ప్రజలు రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదని అధికారులు చెబుతున్నారు. లోడ్ రిలీఫ్ పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. పంటలు కాపాడుకునేందుకు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోకుండా అతికష్టమ్మీద కాపాడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల వదిలిపెడుతున్నారు.
వర్షాలు లేవు. ఎండలు మండిపోతున్నాయి. కళ్లెదుటే పంటలు ఎండిపోతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడి మట్టిపాలవుతోంది. బోరు బావుల ద్వారా పంటలు కాపాడుకుందామా అంటే కరెంట్ కోతలు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా.. చాలా ప్రాంతాల్లో అనధికారిక కోతలు విధిస్తున్నారు. దీనికి తోడు లోఓల్టేజీ సమస్య. అప్రకటిత విద్యుత్ కోతలతో గ్రామాలలో రాత్రి పూట అంధకారం నెలకొనగా పంటలు ఎండిపోతున్నాయి. పైర్లు కళ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటలకు పగటిపూట విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలపై పలుచోట్ల రైతులు పంటపొలాలు పశువుల మేతగా వదిలేస్తున్నారు.
గంటల కొద్దీ కోతలు
కొద్దిరోజులుగా మదనపల్లి నియోజకవర్గంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండానే విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కొన్ని గ్రామాల్లో నాలుగు గంటలు, మరికొన్ని గ్రామాల్లో ఐదు గంటల పాటు విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తున్నారు. ఇదంతా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మొదలవుతోంది. ఒక సమయం అంటూ లేకుండా కోతలు విధించడంతో రైతులు రగిలిపోతున్నారు. వరుణుడు ముఖం చాటేయడంతో నిండు కుండాలా ఉన్న చెరువులు సగానికి పైగా భూమిలోకి ఇంకిపోయాయి. వరి నారుమళ్లు అధికం కావడంతో రైతులు నీటిని తోడేయడంతో చిన్న చిన్న కుంటలు పూర్తిగా ఎండిపోయే పరిస్థితితులు నెలకొన్నాయి.