Jul 16,2023 21:40

ప్రజాశక్తి- గుమ్మలక్ష్మీపురం : జులై నెల సగం ముగిసినా నేటికీ వర్షాభావం వెంటాడుతోంది. సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు పొలం పనులు ప్రారంభించలేదు. వారానికి ఒకట్రెండు రోజులు అడపాదడపా పడుతున్న వర్షాలు పొలం పనులు ప్రారంభానికి సరిపడవని రైతులు చెబుతున్నారు. ఏకధాటిగా వర్షాలు కురిస్తే తప్ప వరినాట్లు వేయడానికి వీలుండదు. దీంతో ఈ ఏడాది కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏజెన్సీ మండలాలైన గుమ్మలక్ష్మీపురం, కురుపాం ప్రాంతాల్లో రైతులు వర్షాలపై ఆధారపడి ప్రతి ఏటా పంటలు పండిస్తుంటారు. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మైదాన ప్రాంతంలో వర్షాధారం, సాగునీటి వనరుల ద్వారా వచ్చే నీటితో పంటలు వేస్తుంటారు. అయితే ఈ ఏడాది వర్షాలు అంతగా లేకపోవడంతో ఖరీఫ్‌ సాగుకు ఎడమ కాలువ ద్వారా నేటికీ నీరు విడుదల చేయని పరిస్థితి. అడపాదడపా వర్షాలు కన్నా ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వేసిన వరి పైరు కూడా ఎండిపోతోంది. జులై నెల రెండో వారం గడిచినా ఎండల ప్రభావం వేసవిని తలపిస్తోంది. మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 1.71 లక్షల ఎకరాల్లో వరిసాగు కానున్నట్లు వ్యవసాయ అధికారుల అంచనా. మరోవైపు గిరిజనులు కొండపోడు పంటలు పండించేందుకు సిద్ధమైన వర్షాలు కోసం ఎదురు చూస్తున్నారు.
వర్షాలే ఆధారం
పొలం పనులు ప్రారంభించడానికి వర్షాల కోసం ఎదురు చూస్తున్నాం. జులై నెల గడిచిపోతున్నా సరైన వర్షాలు పడలేదు. మండుతున్న ఎండలకు వేసిన వరి పైరు కూడా ఎండిపోతుంది. ఖరీఫ్‌ పంటల కోసం ఎదురుచూసినా, సాగునీరు లేక నిరాశ తప్పడం లేదు.
- సునాది గంగన్న దొర, గిరిజన రైతు
విత్తనాలు అందించాలి
సరైన వర్షాలు పడక పోవడంతో వేసిన వరిపైరు ఎండిపోయింది. ఆగస్టులో వర్షాలు పడితే వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు గిరిజన రైతులకు విత్తనాలను మరల రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాలి. ఆర్‌బికె ద్వారా నష్టపోయిన పంటలను పరిశీలించి పంట బీమా అందించాలి. - కోలక అవినాష్‌,
ఎపి గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు