
ప్రజాశక్తి - తణుకురూరల్
కమ్యూనిస్టులు పదవుల కోసం కాకుండా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాత్రమే పని చేస్తారని ఆచరణలో చూపిన వ్యక్తి మద్దాల వెంకట స్వామి అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ప్రతాప్ అన్నారు. సోమవారం స్థానిక అమరవీరుల భవనం వద్ద మద్దాల వెంకటస్వామి 15వ వర్థంతి సందర్భంగా మద్దాల విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగాల వల్లే ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచిస్తున్నాయన్నారు. మద్దాల వెంకటస్వామి చిన్ననాటి నుంచి జాతియోధ్యమ స్ఫూర్తితో అగ్రకులంలో జన్మించినప్పటికీ పేదల కోసం తుదివరకూ జీవించారన్నారు. తనకున్న ఆస్తిని ఉద్యమాలు, పోరాటాలు కోసం ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. మద్దాల వెంకటస్వామి దేవా దాయ, కౌలు రైతుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినప్పటికీ కూడా నేటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర స్ఫూర్తితో కాకుండా కార్పొరేట్ల దారిలో సాగడం బాధాకరమన్నారు. మద్దాల ఆశయాలు అమలు కోసం పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గార రంగారావు, అడ్డగర్ల అజయకుమారి, వెంకటస్వామి మనవరాలు యర్రా రాజ్యలక్ష్మి, ఉషా, నారాయణరావు పాల్గొన్నారు.