గోరంట్ల రూరల్ :శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకరమణపల్లి గ్రామంలో శుక్రవారం నాడు వడ్డెర కులస్తులపై వైసిపి మద్దతుదారులు దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైనదని, తక్షణం దీనిపై పోలీసులు స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ డిమాండ్ చేశారు. వడ్డెర కుటుంబ సభ్యులపై భౌతిక దాడులతో దద్దరిల్లిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వెంకటరమణపల్లి గ్రామాన్ని సిపిఎం జిల్లా నాయకత్వం శనివారం ఉదయం సందర్శించింది. శుక్రవారం నాడు దాడి జరిగిన విషయమై వాస్తవాలు తెలుసుకోవడానికి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇఎస్.వెంకటేష్, పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు జంగాలపల్లి పెద్దన్న, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరప్పలతో కలిసి నాయకత్వ బందం గ్రామానికి వెళ్లింది. బాధిత కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులతో మాట్లాడారు. ముందస్తు ప్రణాళికతో అధికార పార్టీ అండదండలతో భూస్వామ్య వర్గాలు వెంకటరణపల్లిలో వడ్డెర కుటుంబ సభ్యులపై దాడి జరిగినట్లు గుర్తించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్ మాట్లాడుతూ వెంకటరమణపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన జరిగిన ఘటన అత్యంత దారుణమైనదన్నారు. అధికార పార్టీ వైసిపి అండదండలతోనే పెత్తందారులు దాడులకు తెగబడ్డారన్నారు. మరో మణిపూర్ ఘటనను గుర్తు చేసేదిలా ఉందన్నారు. కర్రలు, బీరుసీసాలతో పాసవికంగా దాడి చేసి గాయపర్చారన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. వారి గుడ్డలు ఊడదీసి వివస్త్రను చేయడానికి ప్రయత్నించారన్నారు. మహిళలు కన్నీటి పర్యవంతం అయి వేడుకున్నా కనికరం చూపకుండా దాడి చేశారన్నారు. నాలుగు నెలల పసికందుపై కూడా దాడి చేశారన్నారు. ఈ దాడిలో నలుగురికి కాళ్లు విరిగి ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారన్నారు. మరో ఐదుగురు కూడా గాయపడ్డారన్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టాలన్నారు. దాడికి పాల్పడిన చెవిరెడ్డి, హనుమంతరెడ్డి, హరినాథ్ రెడ్డి, మద్దిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శంకర్ రెడ్డితో పాటు కర్నాటక రాష్ట్రం నుంచి వచ్చిన యువకులను అందరినీ వెంటనే అరెస్టు చేయాలన్నారు. వివాదాస్పద రెండు సెంట్ల స్థలాన్ని వడ్డెర కుటుంబానికి అందజేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల పహారాలో వెంకటరమణ పల్లి
గోరంట్ల మండల పరిధిలోని వెంకటరమణపల్లిలో శుక్రవారం జరిగిన ఇరు వర్గాల దాడుల ఘటనతో గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ ఘటనలో దాడులకు పాల్పడిన 14 మంది నిందితులపై కేసులు నమోదు చేయగా వారిలో తొమ్మిది మందిని శనివారం రిమాండ్‌కు తరలించారు. మిగిలిన వారికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు రాకూడదని సిఐ సుబ్బరాయుడు ఆదేశాలు జారీ చేశారు. దాంతో గ్రామంలోకి పోలీసులు కొత్తవారిని ఎవరినీ అనుమతించ లేదు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి పహారకాస్తున్నారు. గ్రామంలో జరిగిన సంఘటనను వీక్షించిన ప్రజలు ఏ సంఘటన జరుగుతుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు.










