Sep 28,2023 22:40

నిర్వహణ కమిటీ సభ్యులతో నేదురుమల్లి

వెంకటగిరి జాతరలో విఐపి పాస్‌లు బంద్‌

నిర్వహణకు 27 మందితో కమిటీ
ప్రజాశక్తి - వెంకటగిరి
వచ్చే నెల 4,5 తేదీల్లో జరగబోవు శ్రీపోలేరమ్మ జాతర నిర్వహణ కమిటి మొదటి సమావేశాన్ని గురువారం నేదురుమల్లి నివాసంలో ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి అన్ని రంగాల ముఖ్య వ్యక్తులను ఒక కమిటిగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ సమన్వకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరింతగా జాతరకు గుర్తింపు వచ్చినట్లు పలువురు పేర్కొన్నారు. ఈ జాతర ప్రజల జాతరగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజల జాతరగా జరగాలనే ఉద్ధేశంతో 27మందితో అన్నీ రంగాల ముఖ్య వ్యక్తులతో నూతన కమిటిని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈకమిటి సమిష్టి నిర్ణయాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల జాతరగా ప్రశాంతగా నిర్వహిస్తామన్నారు. వెంకటగిరి సంస్థానదీశులు మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర సలహాలు, సూచనలు, సంప్రదింపులతో సాంప్రదాయ బద్దంగా జాతరను నిర్వహణ సాగుతుందన్నారు. గతంలో విఐపి పాసుల పేరుతో భక్తులకు అసౌకర్యం కలగేదన్నారు. ఈసంవత్సరం విఐపి పాసులను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తీర్మానించారు. ఈ విఐపి పాసుల కారణంగా సామాన్య భక్తులకు అమ్మవారిని దర్శించుకోవడం ఆలస్యం అయ్యేదన్నారు. ఉచిత దర్శనాలు ప్రశాంతంగా జరిగేందుకు ఈనిర్ణయం తీసుకున్నామన్నారు. ఊరేగింపు రోజు అమ్మవారని ట్రాక్టరులో కాకుండా గతంలో రధంపై ఊరేగింపు సాగే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.పట్టణ ప్రజలకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విషయము కమిటి ముందుంచి సమస్యలు లేకుండా చూసుకుంటామన్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ పట్టణ కన్వినర్‌ ఢల్లిీబాబు మాట్లాడుతూ విఐపి పాసుల ఎత్తివేయడం మంచి నిర్ణయమని ఈనిర్ణయముతో సామాన్యులకు అసౌకర్యం కలగకుండా ఉంటుదన్నారు. ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతర పోలీస్‌ జాతరగా కాకుండా ప్రజల జాతరగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈకమిటిలో సిపిఎం వెంకటగిరి ఏరియా ఆర్గనైజర్‌ వడ్డిపల్లి చెంగయ్య, డాక్టర్‌ కళాధర్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి నెమ్మళ్లపూడి సురేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
నిర్వహణ కమిటీ సభ్యులతో నేదురుమల్లి