May 25,2023 00:15

నివాళులర్పిస్తున్న కె.రమాదేవి

ప్రజాశక్తి - రేపల్లె : రేపల్లె పట్టణంలోని 12వ వార్డుకు చెందిన సిపిఎం మాజీ నాయకుడు ముమ్మలనేని వెంకటేశ్వరరావు మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.రమాదేవి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం నుంచి వెంకటేశ్వరరావు సిపిఎం తరుపున రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఉద్యమాల్లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా వెంకటేశ్వరరావు మంచి క్రీడాకారుడని తెలిపారు. బ్యాట్మెంటన్‌లో రాష్ట్రస్థాయిలో అనేక పథకాలు సాధించినట్లు తెలిపారు. రేపల్లె మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్‌ కొరటాలతో వెంకటేశ్వరరావుకు మంచి సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరావు నిత్యం రేపల్లె నియోజకవర్గంలోని సమస్యలను కొరటాల దష్టికి తీసుకెళ్తూ ఉండేవారని తెలిపారు. జూనియర్‌ కళాశాల ఆవరణలో అప్పట్లో నివాసముంటున్న పేదల గుడిసెలు తొలగిస్తున్న సమయంలో వెంకటేశ్వరరావు బాధితుల పక్షాన నిలబడినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి.వెంకటరమణారావు, సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌.మణిలాల్‌, బుడా చైర్మన్‌ దేవినేని మల్లికార్జున రావు, మాజీ ఎమ్మెల్యే ఎం. వెంకటసుబ్బయ్య, పలువురు కౌన్సిలర్లు తదితరులు వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.