Feb 26,2023 23:44

సుందరంగా తీర్చిదిద్దిన ఆలయం

ప్రజాశక్తి -నక్కపల్లి:ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉపమాక వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. మార్చి 3వ తేదీన స్వామి కళ్యాణం సందర్భంగా సుధూరు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. ఇందుకుగాను టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ఉపమాక - నక్కపల్లి ప్రధాన రహదారికి ఆనుకుని స్వామివారి పుష్కరిణితో పాటు, సువిశాలమైన పెద్ద చెరువు కూడా వుంది. రాత్రి వేళల్లో పిల్లలు, వృద్దులు నడిచి వచ్చేటప్పుడు ప్రమాదవశాత్తు చెరువుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు ఆదివారం ఉదయం నుంచి సుమారు కిలోమీటరు పొడవునా రోడ్డు పక్కన చెరువు గట్లపై తాత్కాలికంగా ఐరన్‌ పెన్సింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ గోపురాలకు, ఇతర కట్టడాలకు, తిరు వీధి సేవలకు సంబంధించి వాహనా లకు ఇప్పటికే రంగులు వేసి సిద్ధం చేశారు. ఆలయ ప్రధాన గోపురం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో భక్తులు వేచి ఉండేందుకు భారీ తాత్కాలిక షెడ్డు ఏర్పాటుకు సామగ్రిని సిద్ధం చేశారు.
జల్లు స్నానం ఏర్పాటుకు చర్యలు
ఉపమాక పుష్కరిణిలో భక్తులు స్నానాలు ఆచరించేందుకు తితిదే అధికారులు జల్లు స్నానం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మార్చి 2న స్వామివారి కల్యాణోత్సవాలకు అంకురార్పణ, 3న కళ్యాణం జరగనుంది. స్వామిని దర్శించుకునేందుకు, కళ్యాణం తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలి రానున్నారు. 3వ తేదీ తెల్లవారుజాము నుండి ఉపమాక జనసంద్రంగా మారనుంది. వచ్చే భక్తుల్లో అధిక సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించి, పుష్కరిణిలో స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటారు.గత రెండు సంవత్సరాల నుండి పుష్కరిణి అపరిశుభ్రంగా ఉండడంతో భక్తులు స్నానాలు ఆచరించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. చెరువు అపరిశుభ్రతపై ఇటీవల ప్రజాశక్తి దినపత్రికలో కూడా అస్తవ్యస్తంగా ఉపమాక పుష్కరిణి అనే శీర్షిక ప్రచురణమైంది. స్వామివారి కల్యా ణోత్సవాలు దగ్గర పడడంతో చెరువులో ఉన్న నాచు, గడ్డి, ఇతర వ్యర్థాలను ఇటీవల కూలీలతో తొలగించారు. నీరు మాత్రం కలుషితమై దుర్వాసన వెదజల్లుతూనే ఉంది. ఇప్పుడు ఏమి చేయడానికి సమయం కూడా లేదు. భక్తులు స్నానాలు ఆచరించడానికి పుష్కరిణి తప్ప మరో మార్గం కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక పుష్కరిణిలో కొంతమేర భక్తులు జల్లు స్నానం ఆచరించే విధంగా తితిదే అధికారులు చర్యలు చేపట్టారు. స్నాన ఘట్టం వద్ద కొంతమేర ఐరన్‌ రేకులతో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు ఆచరించడానికి ఏర్పాటు చేసిన స్నాన ఘట్టం వద్ద నీటిని మోటార్ల సహాయంతో శుద్ధి పరిచి, ఆ నీటితో భక్తులు స్నానాలు ఆచరించే విధంగా జల్లు స్నానం ఏర్పాటు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు కొద్దిమేర స్థలంలో స్నానాలు ఆచరించడం ఇబ్బందికరమే. ఈ ఏడాది కూడా భక్తులకు ఇబ్బందులు తప్పేటట్టు లేదు. తితిదే అధికారులు ముందే మేల్కొని చెరువును శుభ్రపరచి ఉంటే బాగుండేదని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.