Apr 26,2023 20:49

మాట్లాడుతున్న మహిళలు

ప్రజాశక్తి - కౌతాళం
పొదుపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా కృషి చేయాల్సిన వెలుగు అధికారులు, వారే అవినీతికి పాల్పడితే తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని మండలంలోని కరణి గ్రామానికి చెందిన రత్న గ్రామ సంఘం మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం వెలుగు కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమ సంఘం రుణం మొత్తం రూ.62 వేలను బ్యాంకులో తమ ఖాతాకు జమ చేసినట్లు తెలిపారు. ఆ డబ్బులను గతంలో ఉన్న సిసి హేమంత్‌ కుమార్‌, విఒఎ శ్రీరాములు రూ.40 వేలను శ్రీనిధి ఖాతాకు బదిలీ చేశారని చెప్పారు. రత్న సంఘం అప్పు ఇప్పటికీ రూ.22 వేలు ఉన్నట్లు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము శ్రీనిధి కింద రుణం తీసుకోవాలనుకుంటే పాత బకాయి చెల్లిస్తే వస్తుందని సిసి, విఎఒ చెబుతున్నారని అన్నారు. తాము మొత్తం రుణం చెల్లించామని నిలదీసినట్లు తెలిపారు. ఈ డబ్బులను శ్రీనిధికి ట్రాన్స్‌ఫర్‌ చేశామని, త్వరలోనే రుణం చెల్లిస్తామని శ్రీరాములు ఒప్పుకున్నారని చెప్పారు. తమకు జరిగిన అన్యాయంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రత్న గ్రూప్‌ సభ్యులు ఉరుకుందమ్మ, నాగలక్ష్మి, నర్సమ్మ, లక్ష్మి, తాయమ్మ, సుశీలమ్మ, ఈరమ్మ, ఉల్లిగమ్మ పాల్గొన్నారు.