Mar 15,2023 23:56

ఉద్యోగ భద్రత కల్పించాలని..

ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలోని మండల కేంద్రాల్లో వెలుగు వివోఏలు( యానిమేటర్లు ) తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర యూనియన్‌ పిలుపుమేరకు మండల మహిళా సమాఖ్య కార్యాలయాల ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయం ముందు వివోఏలు నిర్వహించిన ధర్నాలో ఆ సంఘం అల్లూరి జిల్లా అధ్యక్షులు ఆర్‌.భాను మాట్లాడుతూ, వివోఏలకు కాల పరిమితి సర్కులర్‌ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ నెల 20న జిల్లాలోని ఐటీడీఏల స్థాయిలో ఆయా మండలాల వివోఏలతో తమ సమస్యల పరిష్కారానికై మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాడేరు ఐటిడిఎ ఎదుట జరిగే ధర్నాకు 11 మండలాల నుంచి వివోఏలు హాజరవుతారని ఆమె తెలిపారు. ఈ ధర్నా శిబిరాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు సందర్శించి వివోల ధర్నాకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల వివోఏల సంఘం నాయకులు పి.సువర్ణ, జీ.తార, ఎం.కిరణ్మయి, మండలంలోని అన్ని పంచాయతీల నుంచి 36 మంది వివోఏలు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ:ఐకెపిలో పని చేస్తున్న యానిమేటర్లకు హెచ్‌ఆర్‌ పాలసీ విధానం అమలు చేసి, ప్రభుత్వం ఇచ్చిన మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయం వద్ద యానిమేటర్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ, డ్వాక్రా మహిళా సంఘాల నిర్వహణకు యానిమేటర్లు చాలా కీలకమైన పనులు చేస్తున్నారన్నారు సమస్యలను పరిష్కరించకుండా, మూడేళ్ల తర్వాత తొలగించడానికి ప్రభుత్వం కాల పరిమితి సర్క్యులర్‌ జారీ చేయడం సరికాదన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు శ్రీను, బుచ్చిబాబు, కృష్ణ పాల్గొన్నారు.