ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
వెలుగు విఒఎ, మెప్మా ఆర్‌పిల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వెలుగు విఒఎ, (సిఐటియు), మెప్మా ఆర్‌పిల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద 36 గంటల ధర్నా, వంట - వార్పు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి విఒఎలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఆవరణలో వంట చేసుకుని మధ్యాహ్నం, రాత్రి భోజనాలు చేశారు. రాత్రి కలెక్టరేట్ వద్ద నిద్రించారు. మూడేళ్ల కాల పరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, గ్రేడింగ్ పద్ధతి వెనక్కి తీసుకోవాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రూప్ ఇన్స్యూరెన్స్ కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, గ్రూపుల విలీనం ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.నాగలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్ మాట్లాడుతూ సిఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పిన సిఎం మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ తీసుకువచ్చి విఒఎలు, ఆర్‌పిలకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వ విభాగాల్లో లేనివిధంగా కేవలం వెలుగు విభాగంలో మాత్రమే కాలపరిమితిని ప్రవేశపెట్టారని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర, వస్తువుల ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విఒఎల సంఘం జిల్లా కార్యదర్శి షేక్ సుభాషిణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్.లింగరాజు మాట్లాడుతూ మెప్మా ఆర్‌పిల గ్రేడింగ్ పద్ధతి వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విఒఎ, ఆర్‌పిలకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూపుల విలీనం పేరుతో విఒఎలను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విఒఎ, అర్‌పిలకు గ్రూప్ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సూపర్ మార్ట్‌ల పేరుతో విఒఎలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా ధర్నా నిర్వహిస్తుంటే జిల్లా అధికారులు బెదిరించడం భయబ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్చలు జరపాలని, సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాకు సంఘీభావంగా అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు కె.విజయలక్ష్మి, మున్సిపల్ వర్కర్‌్‌స యూనియన్ నాయకులు బి.సోమయ్య, వి.సాయిబాబు, జై.గోపి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి నాయకులు ఎం.ఆమని, మేరీ, కృష్ణకుమారి, లక్ష్మీ, కృష్ణవేణి, ఝాన్సీ, మరియమ్మ, కనకమ్మ, విజయకుమారి నాయకత్వం వహించారు.










