Mar 27,2022 12:19

కారు ఆగింది.
అది సూర్యం హోదానూ మోసుకొచ్చింది.
సూటు, బూటుతో అందులోంచి దిగాడు.
'ఎవరీ ఆఫీసర్‌?' అని రోడ్డు వెంబడి వెళ్తున్న జనం ఆగి చూస్తున్నారు.
చెక్కలు అందించే స్థాయి నుంచి చెక్కులు అందించమని చెప్పే స్థాయికి ఎదిగిన సూర్యం, నల్ల కళ్లద్దాలు తీసి, ఆ ఇంటివైపు కృతజ్ఞతగా చూశాడు.
ఆ సంకేతాన్ని పసిగట్టిన కొందరి మనస్సుల్లో గత కాలపు సంఘటనలేవో మెదిలాయి. చిన్నచూపు చూసిన కళ్లు, అవమానించిన నోళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఈసారి ఈసడించుకోవడానికి కాదు, అతనో కాదో నిర్ధారించుకోవడానికి.
ద్వారం ముందు తలవంచి, రెండు చేతులను నేలకి ఆనించాడు సూర్యం. అతని ప్రాణం గోదారి పరవళ్లు లెక్కన ఉరకలేసింది. అది స్పష్టంగా అతని మొహంలో తెలుస్తోంది.
ఈ సంకేతాన్ని చూడగానే జనానికి నిర్ధారణ అయిపోయింది. తెరుచుకున్న వాళ్ల నోళ్లను మూసేసి, విప్పారిన కళ్లతో ఆశ్చర్యంగా చూడసాగారు. వాళ్లను పట్టించుకోలేదు సూర్యం. తన జీవితాన్ని నిలబెట్టిన ఆ ఇంటిని, అమ్మలా ఒడిలో పెట్టుకుని లాలించి, ఆశ్రయమిచ్చిన ఆ పరిసరాలను గుర్తుచేసుకోగానే అతని మనస్సు ఉప్పొంగింది.
లోపలికి ప్రవేశించాడు. కారును అక్కడే పార్కింగ్‌ చేసిన డ్రైవర్‌ సూర్యంను అనుసరించాడు. అతను లోపలికెళ్లగానే అతని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్న జనాలు నిష్క్రమించారు.
ఓసారి చుట్టూ చూశాడు సూర్యం. మొక్కలు మారాయేమోగాని అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో మార్పు లేదని గ్రహించాడు. అతనికి జీవితాన్ని ప్రసాదించిన 'అడితి' (టింబర్‌ డిపో) ఎటువంటి మార్పులూ లేకుండా నడుస్తుండడం గమనించాడు. తండ్రి యాదయ్య కాలం చేసినా, జ్ఞాపకంగా ఉండిపోయిన ఆ చిన్నపాకను చూడగానే గతం ఫ్లాష్‌లాగా మెదిలింది. గొంగళి పురుగులా అక్కడే పడి కొట్టుమిట్టాడుతున్న అతని జీవితం సీతాకోకచిలుకలా ఎలా రంగులమయమైందో గుర్తుకొచ్చింది.

                                                                      ***

చెత్త కుప్పల్లోంచి పసిబిడ్డ ఏడుపు వినిపిస్తుంటే యాదయ్య అటువైపు వెళ్లాడు. ఎవరో ఆ పసిబిడ్డను వదిలేశారు. ఆకలికి తట్టుకోలేని ఆ పసిప్రాణం ఏడుపుతో అల్లల్లాడింది. చూసిన చాలామంది తమకెందుకులే అని వెళ్లిపోయారు. యాదయ్య అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఆ పిల్లాడిని ఆర్తిగా చూశాడు. చిన్నప్పుడే మరణించిన తన మనవడు గుర్తురావడంతో అమాంతం గుండెలకు హత్తుకున్నాడు. ఆ పిల్లాడి ఆలనా పాలనా తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అతనికి 'సూరీడు' అని పేరు పెట్టుకున్నాడు. యాదయ్య ఒక బిచ్చగాడైనా సూరీడిని కంటికి రెప్పలా చూసుకోసాగాడు. ఓ మంగళవారంనాడు అభయాంజనేయ స్వామివారి దేవస్థానం మెట్ల దగ్గర యాదయ్యతో పాటుగా జోలెలాంటి సంచిని పట్టుకుని నిలబడ్డాడు ఆరేళ్ల సూరీడు. స్వామి దర్శనానంతరం తిరిగొస్తున్న భక్తులు తమకు తోచినంత ఆ సంచిలో వేస్తున్నారు. అటుగా హారన్‌ మోగిస్తూ వచ్చిన స్కూల్‌ బస్‌ రోడ్డుమీద ఆగింది. క్యారేజీలు పట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ల పిల్లల్ని ఎక్కించారు. 'టాటా'లు చెప్తూ సాగనంపారు. బస్‌ కదిలింది.
'జానీ! జానీ! ఎస్‌ పాపా!
ఈటింగ్‌ షుగర్‌ నో పాపా!
టెల్లింగ్‌ లైస్‌ నో పాపా!
ఓపెన్‌ యువర్‌ మౌత్‌. హ హ హ' అంటూ కేరింతలు కొడుతూ రైమ్స్‌ పాడడం మొదలెట్టారు.
పిల్లలు రాగయుక్తంగా పాడుతుండడంతో మైమరిచిపోయాడు సూరీడు. చేతిలోని సంచి ఓ పక్కగా జారడంతో చిల్లర కింద పడింది. 'చిల్లర పోతుంటే చూడవేంది బిడ్డా...' పరధ్యానంలో ఉన్న సూర్యుణ్ణి అదిలించాడు యాదయ్య. సూరీడేం మాట్లాడలేదు. స్కూల్‌ బస్‌ వంక చూడసాగాడు. వాళ్లకు లాగా తనూ చదువుకోవాలనే కోరిక పుట్టింది. ఓ రోజు మధ్యాహ్నం వేళ సూరీడు కనిపించకపోవడంతో కంగారుపడి మొత్తం గాలించాడు యాదయ్య. నెత్తిమీదకి నిప్పుల్ని వెదజల్లు తున్నట్లు కాస్తున్న ఎండ ప్రభావానికి అతని గుండె అదిరదిరిపడుతుంది. కళ్లు బైర్లు కమ్ముతున్నారు. కనిపించిన వారందర్నీ ఆరా తీస్తున్నాడు. 'మాకు తెలీదు' అనే మాటలు నిరాశకు గురిచేస్తున్నా వెతుకులాట ఆపలేదు. కాన్వెంట్‌ దగ్గర ఉన్నాడని ఎవరో చెప్పడంతో హడావుడిగా అక్కడికెళ్లాడు యాదయ్య. గేటు దగ్గర నిలబడి, ఆ గేటు చువ్వలకు తన మొహం ఆనించి ఆశగా స్కూల్‌ పిల్లల వంక చూస్తున్న సూరీడు కనిపించాడు. దగ్గరికెళ్లి సూరీడి రెక్క పట్టుకుని ఇవతలకు లాగాడు యాదయ్య. అంతకుముందు నుంచే ఏడుస్తున్న సూరీడు, మరో చేత్తో కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఏడుపుతో సూరీడి మొహమంతా కందిపోయింది. అతన్ని అలా చూడడంతో యాదయ్య హృదయం చివుక్కుమంది. అతనిలో కోపం స్థానంలో ప్రేమ ఆక్రమించింది.
'ఏమైంది బిడ్డా? ఇక్కడున్నావేం?' లాలిస్తూ విషయమడిగాడు.
'లోపలికి రానిత్తల్లేదు. ఆళ్లతో ఆడుకోనిత్తల్లేదు. తోసేశారు! నేను సదువుకోకూడదట!' ఏడుస్తూనే చెప్పాడు సూరీడు. యాదయ్యకు విషయం అర్థమైంది. అణగారిన వర్గాలకు, నిమ్న వర్ణాల వారికి ఒకప్పుడు దేవాలయాల్లో ప్రవేశం నిషిద్ధం! అది ఇప్పుడిప్పుడు మారి 'దేవుని ముందు అందరూ సమానమే' అనే భావన పెరగడంతో వారికీ ప్రవేశం కల్పిస్తున్నారు. ఈ దుస్థితి విద్యాలయాల్లో ఇంకా అలానే ఉండడం అతన్ని బాధించింది. 'నేనటేపు ఎల్లొద్దన్నాగా... ఎందుకెల్లావ్‌?' ఏమీ చేయలేనితనంతో సూరీడి చేయి పట్టుకుని లాక్కెళ్లిపోయాడు.
'నానూ ఎల్తా... పంపు...' కాన్వెంట్‌ వంక చూస్తూనే ఉన్నాడు సూరీడు. యాదయ్యేం మాట్లాడలేదు. సూరీడు ఎంత అడుగుతున్నా మౌనం వీడలేదు. నడిచినంతసేపు వదలకుండా సూరీడు అడుగుతుండడంతో నోరు విప్పాడు యాదయ్య. 'అట్టా రంగురంగుల బట్టలేసుకుని బడికి పోవాలంటే బోల్డంత డబ్బు కావాలి బిడ్డా... నాతాన డబ్బు లేదు. రోజూ ఇంత ముద్ద అడుక్కుంటేనే మన కడుపులు నిండవు. ఈ ముసలాడు నీకేం సదువు సెప్పించగలడు సెప్పు?'. అతని గుండెలో రగులుతున్న లావా బయటపడింది. బిక్కమొహం వేశాడు సూరీడు. 'ఏ తల్లి కన్న బిడ్డవో.. సెత్త కుప్పల దగ్గర దొరికితే, సూసి వదిలేయలేక తెచ్చి పెంచుకుంటున్నారా.. నాకే దిక్కు లేదు. ఇంకా నీకెట్టా ఎట్టేది? అన్నింటికీ డబ్బే కావాల్రా.. అదుంటే అన్నీ వొత్తారు..' బాధించిన గతమేదో గుర్తురాగా కన్నీళ్ల పర్యంతమయ్యాడు.
'ఇదిగో ఉందిగా...' తన భుజానికున్న చిల్లర సంచిని చూపించాడు సూరీడు. అతని అమాయకత్వానికి నిర్వేదంగా నవ్వాడు యాదయ్య. చెట్టుకింద కూర్చున్నాడు. సూరీడిని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. 'ఇది మన కడుపు నింపుతుంది. కానీ, జేబు నింపదు బిడ్డా. డబ్బుంటేనే సదువుకోగలం! దాన్ని పనిసేసి సంపాదించుకోవాలి. సేసే ఓపిక నాకు లేదు' అంటూ తుండుతో కళ్లు ఒత్తుకున్నాడు. సూరీడులో పట్టుదల పెరిగింది. చినుగులున్న చొక్కాలు ఒకదానిమీద ఒకటి వేసుకున్నాడు. ఒక చొక్కా చినుగులను ఇంకో చొక్కా కప్పిపుచ్చింది. చిల్లులు పడి ఉన్న చెప్పులు తొడుక్కుని, ఉంగటాలు తెగిపోయేదాకా తిరిగాడు. చిన్న పిల్లాడని, అడుక్కునేవాడని ఎవ్వరూ పనివ్వలేదు. కాలుతున్న కడుపు, దాన్ని రగుల్చుతున్న కోరిక అతన్ని విశ్రమించనివ్వలేదు. ఒక తలుపు మూసేసినా, సూరీడు కోసం మరో తలుపు తెరుచుకుంది. ఊరి చివర 'అడితి' (టింబర్‌ డిపో) కనిపించడంతో భయం భయంగా లోపలికెళ్లాడు. అక్కడ పెద్ద పెద్ద రంపాలతో దుంగల్ని కావాల్సిన ఆకారాల్లో కోస్తున్నారు. ఎవరితోనో మాట్లాడుతున్న యజమాని చక్రధర్‌, బిడియంగా తచ్చాడుతున్న సూరీడిని పిలిచి, 'ఏం కావాలి?' అని అడిగాడు.
'ఏదైనా పనిప్పించండయ్యా..' అంటూ అతని కాళ్ళు పట్టుకున్నాడు సూరీడు.
'ఏరు! ఎవర్రా నువ్వు? నీ పేరేంటి? మీ అమ్మా, నాన్నా ఎవరు?' ఆ హఠాత్పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు చక్రధర్‌.
'నా పేరు సూరీడయ్యా... ఏదన్నా పనిప్పించండయ్యా...' వేడుకుంటున్న సూరీడిని గుడి దగ్గర బిచ్చం అడుక్కుంటూ చూసినట్లు సూచాయగా జ్ఞప్తికొచ్చింది.
ఇంతకుముందు చాలామంది బిచ్చగాళ్లూ, వాళ్ల పిల్లలూ బిచ్చం అడగడమే కాని ఇలా పనిమ్మని ఎవరూ అడగలేదు. స్వతహాగా కరుణామయుడైన చక్రధర్‌, సూరీడి అర్థింపుకు కరిగిపోయాడు. అతన్ని పైకి లేపాడు. 'ఒరేరు రంగా! ఈడ్ని పనిలో పెట్టుకో. ఆ చెక్కలు అందించే పని చెప్పు'. చక్రధర్‌ అభయమివ్వడంతో కృతజ్ఞతగా చేతులెత్తి నమస్కరించాడు సూరీడు.
ఉదయం ఎనిమిదింటికల్లా అడితికి రావడం, రంగడు చెప్పిన పనులు చేయడం, చీకటి పడ్డాక వెళ్లిపోవడం అతని దినచర్యగా మారిపోయింది. శ్రద్ధగా పనిచేస్తున్న సూరీడిని చూసి చక్రధర్‌ ముగ్ధుడయ్యాడు. ఇకనుంచి అడితిలోనే ఉండమని చెప్పాడు. సూరీడితోపాటుగా అతని తండ్రి యాదయ్య కూడా వచ్చాడు. ఆ అడితి మొత్తాన్ని శుభ్రం చేయసాగాడు. వాళ్ల కష్టాన్ని చూసిన చక్రధర్‌, పక్కనే చిన్నపాక కట్టించాడు. వాళ్లిద్దరికీ మూడు పూటలా భోజనం ఏర్పాటు చేయించాడు. సూరీడు నిష్టగా పనిచేస్తున్నా, ఉదయం ఎనిమిదిన్నర్ర గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు అలారం కొట్టినట్లు ఆ అడితి మీదుగా వెళ్తున్న స్కూల్‌ బస్‌ హారన్‌, అందుల్లోంచి వచ్చే రైమ్స్‌ వినిపించగానే దానివంక ఆరాధనగా చూస్తుండడం చక్రధర్‌ దృష్టిని దాటిపోలేదు. రోజులు వేగంగా నడుస్తున్నాయి. ఆ రైమ్స్‌ ఔపోసన పట్టేసిన సూరీడు, అలుపు లేకుండా అవి పాడుతూ పని చేసుకుంటున్నాడు.
ఒకరోజు చక్రధర్‌ దగ్గర వడ్డీకి తీసుకున్న ఒకతను, డబ్బులు తిరిగి ఇస్తూ, 'నమస్తే సేటు గారూ! ఇవిగోండి మీ అసలూ, దాని రెండు నెలల వడ్డీ రెండు వందల రూపాయలు...' అంటూ ఆయన చేతిలో పెట్టి వెళ్లిపోయాడు. 'ఆయన డబ్బులు తీసుకుని మూడు నెలలయ్యింది కదయ్యా...' అతను వెళ్లగానే గుర్తు చేశాడు సూరీడు. 'నీకెలా తెలుసు?' ఆశ్చర్యంగా అడిగాడు చక్రధర్‌. 'జెండా పండగ అయ్యాక ఆయనొచ్చి డబ్బులు తీసుకున్నాడు కదయ్యా! తర్వాత ఇనాయక పండగ చేశాం. ఇగ్రహం పెట్టాం. నాన్నకు, నాకు కొత్త బట్టలు పెట్టారు. రంగన్నయ్యను అడిగితే రెండు నెల్లకు దసరా పండగ వచ్చిందని, అందుకే బట్టలు పెట్టారన్నాడు. మొన్ననే దీపావళి కూడా అయిపోయింది. అందరూ బాంబులు కాల్చారు కదయ్యా!' గ్రహించినదంతా వివరంగా చెప్పాడు సూరీడు.
చక్రధర్‌ బాగా సంపాదించాలని వడ్డీ వ్యాపారం చేయడం లేదు. ఊళ్లో జనాల అవసరాలకు ఆదుకోవాలనే సంకల్పంతోనే చేస్తున్నాడు. నాలుగు రోజులు అటూ ఇటూ అయినా పట్టించుకోడు. అసలు మొత్తం తీసుకొచ్చి చేతిలో పెట్టి, వడ్డీ ఇప్పుడే ఇచ్చుకోలేనయ్యా అంటే 'త్వరగా తీర్చేయ్యాలి' అంటాడు. ఆ సంగతి తెలీని సూరీడు, యజమానికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు. తొమ్మిదేళ్ల పిల్లాడు నోటిలెక్కలు చెప్పడంతో అతనిలోనున్న మెరుపును గుర్తించాడు చక్రధర్‌. 'చదువుకోవాలని ఉందా?' అని అడిగాడు.
ఆ మాట వినగానే సూరీడి అణువణువూ పులకించింది. తలూపుతూ తన సమ్మతిని తెలియజేశాడు. అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, 'మరి నాన్న...' అంటూ యాదయ్యవైపు చూశాడు. 'నేను చూసుకుంటాలేరా... నువ్వు బాగా చదువుకుని పెద్ద ఆఫీసరవ్వాలి...' ఆకాంక్షించాడు చక్రధర్‌. అతను మనసారా దీవించడంతో అమితానందంగా తండ్రి దగ్గరికెళ్లి విషయం చెప్పాడు సూరీడు. చక్రధర్‌ చేస్తున్న సహాయానికి, 'ఇంతకుమించి నేనేం ఇచ్చుకోలేను' అన్నట్లు ఆనందభాష్పాలతో కృతజ్ఞతగా చూశాడు యాదయ్య.
'అయ్యా...' పిలిచాడు రంగడు.
'ఏంట్రా...' చెప్పమన్నాడు చక్రధర్‌.
'అట్టా సదువుకు పంపించేస్తే ఎట్టాగయ్యా? ఇక్కడ పని...' నసిగాడు రంగడు.
'జ్ఞానానికి, దీపానికి ప్రత్యేకమైన గుర్తింఫు అవసరం లేదురా రంగా! అవి పాతాళంలో ఉన్నా, దశదిక్కులకూ తమ కాంతులను ప్రసరింపజేస్తూనే ఉంటాయి. అందుకు 'విద్య' అనే దీపం వెలిగించుకోవాలి. నేను అదే వెలిగిస్తున్నా.. వాడు వెళ్తే మనకు పనివాళ్లే దొరకరా..' అంటూ నవ్వేశాడు చక్రధర్‌.
సూరీడుగా ఉన్న పేరును 'సూర్యం'గా మార్చాడు. ఇక్కడే ఉంటే, చదువు మీద ధ్యాస పెట్టకుండా, అడితిలో పనిచేస్తూ లక్ష్యాన్ని దారి మళ్లిస్తాడేమోనని అనాథల వసతి గృహంలో చేర్పించాడు. చక్రధరే అన్నీ సమకూర్చేవాడు. ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం గల సూర్యం, చక్రధర్‌ స్పూర్తితో గ్రూప్‌ వన్‌ పరీక్ష రాసి పాసయ్యాడు.

                                                                    ***

గతమంతా కదిలెళ్లగా సాధించిన విజయానికి ఆనవాలుగా సూర్యం ఛాతీ పెరిగింది. నాలుగేళ్లుగా అలుపెరగని భాధ్యతలు నిర్వర్తిస్తున్న అతను, ఇక్కడికి బదిలీ కావడంతో చక్రధర్‌ను కలవడానికొచ్చాడు. 'సార్‌.. మీరూ.. సూర్యం బాబు కదా.. రండి బాబు..' అక్కడున్న ఒకతను సూర్యంను గుర్తుపట్టాడు. 'అయ్యగారూ.. మన సూర్యం బాబు వచ్చారండీ..' అంటూ యజమాని చక్రధర్‌ను పిలిచాడు. 'ఎవరూ?' అంటూ కళ్లద్దాలు తుడుచుకుంటూ వెలుపలకొచ్చాడు చక్రధర్‌. ముప్పావువంతు బట్టతల, నెరిసిన గడ్డం, తెల్లగా ఉన్న గుబురు మీసాలు, రామరాజ్‌ బనియన్‌, మడిచి కట్టిన పంచెతో ఉన్న చక్రధర్‌ కనిపించాడు. గమ్యమెరుగని అతని నావకు దారిచూపిన దార్శినికుడు, గతి తప్పిన అతని జీవితాన్ని శృతి చేసిన మహానుభావుడిని చూడగానే సూర్యం కళ్లు చెమర్చాయి. సూర్యంను చూడగానే చక్రధర్‌ మనస్సు ఉప్పొంగింది.
    'ఆగిపోయావేం.. లోపలికి రా సూరి..' నోటికి చేయి అడ్డు పెట్టుకుని దగ్గుతూ ప్రేమగా ఆహ్వానించాడు. 'ఈ మంచినీళ్లు తాగండి. మీరిలా కంగారుపడితే మీ ఆరోగ్యం ఏం కానూ?' స్వయంగా తనే లోపలికి తీసుకెళ్లి, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించాడు సూర్యం. 'నేనొచ్చిన పని అయిపోయిందిరా.. పైనుంచి పిలుపు కోసం ఎదురుచూడడమే మిగిలింది' అంటూ ఆయాసపడ్డాడు చక్రధర్‌.
'ప్రకృతికి వెలుగునిచ్చే సూర్యుడికి మరణం ఉందంటారా?' నవ్వాడు సూర్యం. 'నీ మెదడులో కొత్త నరాలు పుట్టినట్లున్నారు. ఆఫీసరయ్యాక మాటలు నేర్చావ్‌. ఇంతకీ ఏం పని మీద వచ్చావ్‌?' సూటిగా అడిగాడు చక్రధర్‌. అది అతని నైజం. దానికింకా వయసు మళ్లలేదనుకున్నాడు సూర్యం. 'అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నం దగ్గర కూర్చుని తింటూ కార్యం తలపెడితే తథాస్తు దేవతలు దీవిస్తారని, కచ్చితంగా జరుగుతుందని మీరే చెప్పారు' అంటూ విషయంలోకి వచ్చాడు సూర్యం.
'అవును... ఏంటో చెప్పు' అడిగాడు చక్రధర్‌.
'విద్యకు దూరమైన నాకు గార్డియన్‌గా ఉంటూ విజ్ఞాన దీపాన్ని వెలిగించారు. ఈ దీపం కాంతిని నలుగురికీ పంచాలనుకుంటున్నాను' చెప్పాడు సూర్యం. 'సూటిగా చెప్పు సూరి..' సూర్యం మనోగతం అర్థం కాలేదతనికి. 'అనాథల వసతి గృహాల్లో చిన్న చిన్న వృత్తివిద్య కోర్సులు మాత్రమే నేర్పిస్తారు. నాలాగా ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అక్కడున్నవారి ఆశ. కానీ మీలా వారికి ఆసరా ఇచ్చేవాళ్లు లేరు. ఎలాగైనా డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ అయ్యి, వారికి చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నాను. వారికి నా వంతు సాయం చేస్తున్నాను. అయినా సంతృప్తి లేదు. అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను' అన్నాడు సూర్యం.
'ఏంటో చెప్పు..' అడిగాడు చక్రధర్‌.
'ఒక అనాథల వసతి గృహం కట్టాలని..' మనసులో మాట చెప్పాడు సూర్యం.
మనం చేరాలనుకున్న గమ్యం తెలిసి, మనం నడిచే దారి బాగోకపోతే కొత్త దారిని సృష్టించుకుంటాం. అలా నడిచి నలుగురికీ మంచి చేస్తానంటున్న సూర్యం అంతరంగాన్ని పసిగట్టాడు చక్రధర్‌. అతని మాటల్లో తన మీదున్న నమ్మకం సజీవంగానే ఉన్నట్లు గ్రహించాడు. తను వెలిగించిన దీపం నలుదిక్కులకూ ప్రసరిస్తున్నందుకు అలౌకికానందాన్ని పొందాడు.
'ఎక్కడ కడుతున్నావ్‌?' సాలోచనగా అడిగాడు చక్రధర్‌.
'స్పాన్సర్స్‌ను పట్టుకోవాలి' ప్రణాళిక చెప్పాడు సూర్యం.
'ఇక్కడ మన అడితి ఉండగా ఇంకా స్పాన్సర్స్‌ ఎందుకు?' మనస్ఫూర్తిగా దీవించాడు చక్రధర్‌.
'వయసు అయిపోతుందని దీన్ని తీసేయ్యమని నేనెన్నోసార్లు అడిగాను. దీన్ని నమ్ముకునే పది కుటుంబాలు బతుకుతున్నాయని మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడు నాకు ఇచ్చేస్తే వీళ్ల పరిస్థితి..' అయోమయంగా అడిగాడు సూర్యం.
'వాళ్లకు నువ్వున్నావ్‌ కదా సూరి..' నవ్వేశాడు చక్రధర్‌.
ఆ నవ్వులో అతని వారసత్వం కనిపించింది.
సూర్యుని కిరణాలకు వెలుగు పుట్టినట్లు, చక్రధర్‌ ప్రోత్సాహానికి సూర్యం ఆశయంలో కాంతి జనియించింది.

దొండపాటి కృష్ణ
90523 26864