Feb 16,2023 23:53

మాట్లాడుతున్న పిఒ

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌: స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. వెలుగు అధికారులు, సిబ్బంది పనితీరు మెరుగు పరుచుకోవాలని స్పష్టం చేసారు. స్వయం సహాయ సంఘాల ఏర్పాటులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించనని హెచ్చరించారు. స్థానిక కాఫీ హౌస్‌ సమావేశ మందిరంలో 11 మండలాల వెలుగు క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశం నిర్వహించారు. కొత్త సంఘాల ఏర్పాటు, స్వయం సహాయ సంఘాల గ్రేడ్లు, బుక్‌ కీపింగ్‌, బ్యాంకు లింకేజీ, రైతు ఉత్పత్తి దారుల సంఘాల పనితీరు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్పత్తులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటిడిఎ పరిధిలో కొత్తగా 1100 స్వయం సహాయ సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే 467 ఏర్పాటు చేసారన్నారు. మిగిలినవి 633 సంఘాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.ఎన్ని సంఘాలకు బ్యాంకు లింకేజీ ఇచ్చారని వెలుగు సిబ్బందిని ప్రశ్నించారు. జి.మాడుగుల, జికె వీధి మండలాల్లో నిర్మిస్తున్న ఎకోపల్ఫింగ్‌ యూనిట్‌లో మహిళా సంఘాలు భాగ స్వామ్యం కావాలన్నారు. ఈ సమవేశంలో వెలుగు ఎపిడి మురళి, ఎల్‌డిఎం రవితేజ, అధికారులు పాల్గొన్నారు.