అరుణిమ ముద్దాడిన
హృదయాల మహా కలయిక
సమర కేతనాలు చేబూనిన
సదాశయ సప్త సముద్ర
ఘోష
పదాలను పరచుకుంటూ
భావ శరమ్ముల
విసురుకుంటూ
భారతి ముంగిలిలో పరిమళించిన
సమతాసుమాలు
హారతి పట్టిన శ్రామిక సమూహాలు
సమ్మెకట్టి, సమైక్యతను చుట్టి
స్వేచ్ఛా సంకల్ప పిడికిళ్ళనెత్తిన
సామ్యవాద స్వాప్నిక ప్రవాహాలు
విముక్తి గీతాల శృతి చేసిన
వీరుల ఢంకాధ్వానాలు
విప్లవాంకురాలకు ప్రాణముపోసి
ఉద్యమ గొంతుకలిచ్చిన
సముజ్జ్వల క్రాంతి పుంజాలు
వ్యక్తులుగా మొదలై
శక్తులై లేచిన
రుధిరజ్యోతుల మహోధ్రితాలు
ఈ నేలన నాటుకున్న ఎర్రని విత్తనమా
నీ పుట్టుక శతవత్సర మహోత్సవమా
తాష్కెంట్ సాక్షిగా నీ జననం
తల్లిభారతి విముక్తికై శపథం
ఎన్ని కుట్రల్లో ఎన్నెన్ని అగాధాల దారుల్లో
రాళ్ళల్లో, ముళ్లుదిగిన నడకల్లో
కొండల్లో వంకల్లో,
నిర్బంధాల వొళ్ళో
త్యాగాలను చల్లుకుంటు
ప్రాణాలను విత్తుకుంటు
అమరత్వపు జ్ఞాపకాల్ని
గానం చేస్తూ
ఎన్ని గాయాల్ని మోసావో
ఎన్ని చరిత్ర పాయల్లో నడిచావో
ఎన్ని చైతన్యాల పంటల్ని చూశావో!
దోపిడీ విషకోరలను పెరికి
పీడనకు సమాధి కట్టేందుకు
మనిషిని మనిషిగా నిలువెత్తుగ నిలబెట్టేందుకు
ఎంత నిబద్ధ యుద్ధతంత్రాలు
ఎన్నెన్ని శోకాలు, అశ్రునయనాలు
ఎన్నెన్ని ఇక్కట్ల సంకెళ్ళ ఛేదనాలు
ఎన్ని దుఃఖాలు
ఎన్ని శోకాలు, అశ్రునయనాలు
ఎన్నెన్ని బాధల గాధల పయనాలు
ఎన్ని ఓదార్పులు, ఎన్ని దీవెనలు,
ఎన్ని వేదనలు
ఎన్ని కోపాగ్నులు ఎన్ని తిరుగుబాట్లు
ఎన్నెన్ని ముందడగులు, తిరగబడులు
అడుగులు కదలని వేళలు
ఎన్ని కాలాలు, కలలు అయినా
ఆగని గమనం
అంతిమ సమరం
ఆగమించు ఉదయం
ఇది చలన స్వరం
అరుణ రథం
శతాబ్ధాల చీకటిపై
ఎగిరే వెలుగు పతాకం!
- కె. ఆనందాచారి
9948787660