వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి : సిఐటియు
ప్రజాశక్తి - బేతంచెర్ల
రవాణా రంగం కార్మికులకు సమగ్ర చట్టం అమలు చేసి, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుతోపాటు, సామాజిక భద్రత కల్పించాలని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ కమిటీ సభ్యులు వైబి వెంకటేశ్వర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం బేతంచెర్లలోని లారీ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో అధ్యక్షుడు వై.ఎల్లయ్య ఆధ్వర్యంలో రవాణా కార్మికుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగంలో తెచ్చిన మోటార్ వాహన చట్టంతో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. పెరిగిన పెట్రోల్ ధరలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా రవాణా రంగ కార్మికులకు ఉరితాడు లాంటి జీవో 21ని తెచ్చి కుటుంబాలను రోడ్డుపాలు చేయడానికి పూనుకోవడం బాధాకరమన్నారు. ఈ రంగంలో పనిచేసే వారికి సొంత ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నష్టం కలిగించే జీవో నెంబర్ 21ని రద్దు చేయాలన్నారు. ట్రాన్స్పోర్టు వాహన రంగాల్లో పనిచేసే కార్మికులందరికీ ప్రభుత్వం తరఫున 60 ఏళ్లు దాటిన వారందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యవసర సరుకుల ధరలు, గ్రీన్ టాక్స్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో లారీ వర్కర్స్ యూనియన్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, మాదన్న, రాజు, రామకృష్ణ, దస్తగిరి, షబ్బీర్ హుస్సేన్, రాముడు, వెంకటేశ్వర్లు, మద్దిలేటి, శ్రీనివాస్ రెడ్డి, మాలిక్ భాషా, నీలకంఠం, బాలకృష్ణ, మధు, వెంకటేష్ నాయక్, శీను నాయక్, నాగప్ప, హిమాం తదితరులు పాల్గొన్నారు.










