Sep 09,2023 23:37

తాడేపల్లిలో టైర్లు దహనం చేసి నిరసన తెలుపుతున్న టిడిపి శ్రేణులు.

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో టిడిపి కార్యకర్తలు, నాయకులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద ఎత్తున తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచే ప్రధాన నాయకులను అరెస్టు చేసి పోలీసుస్టేషన్లకు తరలించారు. మరికొంతమందిని ముందస్తు అరెస్టు చేశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆర్‌టిసి అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేశారు. దుకాణాలను కూడా కొంత మంది వ్యాపారులు మధ్యాహ్నం వరకు మూసివేశారు. గుంటూరులో నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, కన్నా లక్ష్మీనారాయణ, మాకినేని పెదరత్తయ్య, కోవెలమూడి రవీంద్ర, నశీర్‌ఆహ్మద్‌ ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేటలో ఆరవిందబాబును గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కోవెలమూడిని అరెస్టు చేసి అరండల్‌పేట పోలీసు స్టేషన్‌కు, నశీర్‌ ఆహ్మద్‌ను లాలాపేటకు తరలించారు. స్థానిక లాడ్జిసెంటర్‌లో నిరసన తెలుపుతున్న నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరిగి సాయంత్రం చంద్రబాబు కాన్వారు తాడేపల్లి వెళ్తుండగా కోవెలమూడి రవీంద్ర తదితరులు నిరసన వ్యక్తం చేస్తుండగా మరోసారి అరెస్టు చేశారు. తక్కెళ్లపాడు వద్ద తెలుగుయువత ఆధ్వర్యంలో రహదారులపై టైర్లు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వారుకు అడ్డుపడిన కంభంపాటి శిరీష, రావిపాటిసాయిపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. తెలుగుయువత కార్యకర్తలపై తక్కెళ్లపాడు అడ్డరోడ్డువద్ద జాతీయ రహదారిపై విరుచుకుపడ్డారు. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సత్తెనపల్లి మెయిన్‌ రోడ్‌లో ధర్నా మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆతుకూరి నాగేశ్వరరావు (చిన్నబాబు) టిడిపి నాయకులు నిరసన తెలిపారు. తెనాలి-నారాకోడూరు రోడ్డులో అంగలకుదురు ప్రధాన కూడలిలో పార్టీ నాయకులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మంగళగిరి లో టిడిపి నేతలను గృహనిర్బంధంలో ఉంచినా కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ జిల్లా నాయకులు పోతినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారు. కార్యకర్తలు జగన్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేసి టైర్లు కాల్చారు.. పిడుగురాళ్ల ఐలాండ్‌సెంటర్‌లో టిడిపి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు గుజ్జనగుండ్ల వద్ద టిడిపి నాయకులు మన్నమ మోహన్‌కృష్ణ ఆధ్వర్యంలో సిఎంజగన్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర నాని నాయకత్వంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అశోక్‌ నగర్‌, కోరిటపాడు గుజ్జనగుండ్ల లాడ్జి సెంటర్లో టైరులు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సానుభూతి తెలిపేందుకు పలువురు కుంచనపల్లి వెళ్లారు. అక్కడ పోలీసులు అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి నర్సరావుపేటలో కాగడాల ప్రదర్శన చేశారు.