
ప్రజాశక్తి - భట్టిప్రోలు
మంత్రి మేరుగ నాగార్జన స్వగ్రామమైన మండలంలోని వెల్లటూరు పంచాయతీ సర్పంచ్ చోటూరు లక్ష్మి గురువారం తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీఒ గుమ్మ చంద్రశేఖరకు అందజేశారు. గత రెండున్నర సంవత్సరాల క్రితం గ్రామంలో ఎలాంటి ఎన్నికలు జరగకుండా ఇరు పార్టీల ఒప్పందం ప్రకారం ఏకగ్రీవం చేసుకున్నారు. దీనిలో భాగంగా తొలి విడతగా చౌటూరి లక్ష్మి సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టారు. రెండవ విడత ప్రస్తుతం ఉపసర్పంచ్ బొజ్జ రవికుమార్ కొనసాగే విధంగా ఆనాడు ఒప్పందం కుదిరింది. ఈ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ అమలు కావడంతో ఎన్నికలు జరిగితే ఇరు వర్గాలకు అధిక ఖర్చులు అయ్యే అవకాశం ఉన్నందున అప్పట్లో గ్రామ పెద్దలు ఒప్పందం చేసుకుని రాజీమార్గం కుదిర్చారు. దీనిలో భాగంగా చౌటుర లక్ష్మి రాజీనామా పత్రాన్ని అందజేసినట్లు పేర్కొన్నారు. కాగా ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా పంచాయతీ అధికారికి పంపనున్నట్లు ఎంపీడీఒ తెలిపారు. ప్రస్తుతం ఉసర్పంచ్‌కి సర్పంచి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సర్పంచ్ ఎన్నిక ప్రజల ఓట్లతో గెలుపొందాల్సి ఉన్నందున ఉన్నతాధికారులు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ద్వారా సర్పంచిని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. రాజీనామా పత్రం అందించిన వారిలో చౌటూరి రవీంద్రబాబు, వైసిపి నాయకులు గుంటూరు సునీల్, కార్యదర్శి రామ్ కుమార్ ఉన్నారు.