Jan 31,2023 23:53

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: విజయవాడ కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్‌ కాలేజిలో జరుగుతున్న అమరావతి బాలోత్సవం 5వ పిల్లల పండుగలో చిన్నారుల కళా ప్రతిభ వెల్లివెరిసింది. కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, ఏలూరు జిల్లాలకు చెందిన 161 పాఠశాల నుంచి 7,600 మంది విద్యార్థిని విద్యార్థులు వివిధ సాంస్కతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు. మూడు రోజుల పాటు జరిగిన బాలోత్సవంలో చివరి రోజు మంగళవారం పలు వేదికలపై జరిగిన కార్యక్రమాలలో పిల్లలు పాల్గొని అలరించారు. దేశభక్తి గీతాలాపనలో సీనియర్స్‌ విభాగంలో పలువురు విద్యార్థులు దేశభక్తిని చాటే విధంగా పలు గీతాలు ఆలపించారు. 'జయ జయ జయహాో' దేశభక్తి చాటుతూ భరతమాత పాటను సిద్ధార్థ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు ఆలపించారు. ''భరతమాత పాదాలకు మువ్వలం.. దేశమాత పాదాలకు మువ్వలం'', ''తేనెల తేటలు మాటలతో'' గన్నవరంకు చెందిన స్రవంతి పాఠశాల విద్యార్థినిలు శ్రోతలను అలరించారు. విచిత్ర వేషధారణ జూనియర్స్‌ విభాగం నుంచి చరిత్రను వివరిస్తూ ఝాన్సీ లక్ష్మీబాయి, వీర పాండ్య కట్ట బ్రహ్మన్న వేషధారణ, శ్రీకష్ణదేవరాయల వేషధారణ, రుద్రమదేవి, మన జాతీయ పక్షి నెమలి వంటి విచిత్ర వేషధారణల్లో చూపర్లను కట్టిపడేశారు. కోలాటం సీనియర్‌ విభాగంలో నిర్వహించిన పోటీలు ఆద్యంతం చూపరులను ఆకట్టుకున్నాయి. విద్యాధరపురం రవీంద్ర భారతికి చెందిన షేక్‌ అహ్మద్‌ డాక్టర్‌ బాబ సాహెబ్‌ అంబేద్కర్‌లా తన నటనతో అలరించారు. సబ్‌ జూనియర్స్‌ విభాగంలో రైమ్స్‌ తెలుగు, ఇంగ్లీష్‌ తమ ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్నారు. జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాలలో వక్తృత్వం తెలుగు, ఇంగ్లీషులలో, పద్య భావం, క్విజ్‌, డిబేట్‌, తెలుగులో మాట్లాడటం వంటి పోటీలలో పిల్లలు తమదైన శైలిలో ప్రతిభను చాటారు.
మట్టితో బొమ్మల తయారీ
కళాశాల ప్రాంగణంలో 300 మంది విద్యార్థులు పాల్గొని మట్టితో తమ ప్రతిభను కనబరుస్తూ వివిధ రకాల బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా మట్టి బొమ్మల తయారు చేస్తున్న సందర్భంగా బాలోత్సవ నిర్వాహకురాలు పి.జ్యోత్స్న, నలంద ఎన్‌ఎస్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌ కెవిఆర్‌ పర్యవేక్షించారు. విద్యార్థులు మట్టితో చేసిన బొమ్మలలో చూపరులను ఆకట్టుకుంది. వివిధ రకాల పండ్లు, మొక్కలతో, పార్కు, వాహనాలు, విమానం, వినాయకుని ప్రతిభలు, బోటు, పండుగ శోభను సంతరించుకునేలా పల్లెటూరి వాతావరణంలో బొమ్మలను తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాలను బాలోత్సవ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు, అధ్యక్షులు ఎస్‌.పి.రామరాజు, ఆఫీస్‌ బేరర్స్‌ యార్లగడ్డ సుబ్బారావు, వెన్నా వల్లభరావు, ఎ.వి రామరాజు, గోళ్ల నారాయణరావు తదితరులు పర్యవేక్షించారు.