ప్రజాశక్తి-వేటపాలెం: మణిపూర్‌లో జరుగుతున్న దురాగతాలను నిరసిస్తూ వేటపాలెంలో ఆదివారం క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని అమానవీయమైన ఘటనలు మణిపూర్లో తలెత్తితే వెలుగు చూడటానికి 90 రోజులు పైగా పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను శాంతికాముకులైన ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారన్నారు. మణిపూర్‌లో క్రైస్తవులపై జరుగుతున్న దారుణమైన దమనకాండకు మతోన్మాద శక్తులే కారణంగా పేర్కొన్నారు. చిన్న చిన్న తెగలను విచ్ఛిన్నం చేసి తమ పబ్బం గడుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని విమర్శించారు. దాదాపు 200 మందితో మొదలైన ర్యాలీ దేశాయిపేట నుంచి వేటపాలెం మండల కేంద్రమైన అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా జస్టిస్ మణిపూర్‌లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు సత్యం, అచ్చయ్య, మాజీ వైస్ ఎంపీపీ మార్పు గ్రగోరి, చేగుడి సురేష్ బాబు, బెంజి, ఏలియా తదితరులు పాల్గొన్నారు.










